భీమవరం బుల్లోడు

4 Dec, 2013 00:53 IST|Sakshi
భీమవరం బుల్లోడు

దసరా బుల్లోడు.. బుర్రిపాలెం బుల్లోడు... బంగారు బుల్లోడు... ఈ మూడూ సూపర్‌హిట్ సినిమాలే. చాలా ఏళ్ల తర్వాత ఆ టైటిల్స్‌ని గుర్తు చేస్తూ ‘భీమవరం బుల్లోడు’ వస్తోంది. ఇందులో హీరోగా చేస్తున్న సునీల్ నిజంగా భీమవరం బుల్లోడే కావడం విశేషం. స్వర్ణోత్సవం జరుపుకుంటోన్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఈ చిత్రం తయారవుతోంది. ‘కలిసుందాం రా’ ఫేమ్ ఉదయ్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. తేజ ‘1000 అబద్ధాలు’ సినిమాతో పరిచయమైన ఎస్తేర్ ఇందులో నాయిక. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని బుధవారం మీడియాకు విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్న ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత డి.సురేష్‌బాబు తెలిపారు. ఇందులో సునీల్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ: కవి కాళిదాస్, కెమెరా: సంతోష్ రాయ్, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్.