వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

7 Nov, 2019 13:18 IST|Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తిక్‌ ఆర్యన్‌ నటించిన తాజా సినిమా పతీ పత్నీ ఔర్‌ వో. భూమి పడ్నేకర్‌, అనన్య పాండే ఇందులో హీరోయిన్లు. 1978లో విడుదలైన పతీ పత్నీ ఔర్‌ వో సినిమా పేరుతో ముదస్సర్ అజీజ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో వైవాహిక బంధం, తన భార్య గురించి చింటూ త్యాగి(కార్తిక్‌ ఆర్యన్‌) చెప్పిన డైలాగులు వివాదాస్పదమయ్యాయి. ‘ శృంగారం విషయంలో భార్య అనుమతి అడిగితే బిచ్చగాళ్లుగా.. ఆమెను తిరస్కరిస్తే మోసగాడిగా... ఇష్టం లేకున్నా బలవంతం చేస్తే అత్యాచారం చేసిన వాళ్లుగా ముద్రవేస్తారు’ అంటూ అతడు చెప్పిన డైలాగులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు.

‘వైవాహిక అత్యాచారం కారణంగా ఎంతో మంది మహిళలు మానసిక వేదన అనుభవిస్తుంటే.. మీకు నవ్వులాటగా ఉందా’ అంటూ మూవీ యూనిట్‌కు చివాట్లు పెడుతున్నారు. డబ్బు కోసం ఎలాంటి క్యారెక్టర్లు చేసేందుకైనా సిద్ధపడతారా అంటూ హీరోయిన్లను సైతం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమి ఫడ్నేకర్‌ మాట్లాడుతూ.... మహిళల సమస్యలను అపహాస్యం చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘ మమ్మల్ని క్షమించండి. మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం లేదు. ఈ సినిమాకు పనిచేసిన ఏ ఒక్కరూ కూడా అసలు అలా ఆలోచించరు. సినిమాను కేవలం వినోద సాధనంగా మాత్రమే చూడాలి’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో భూమి ఫడ్నేకర్‌ చింటూ త్యాగి భార్య పాత్రలో నటిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు