మా మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది: హీరోయిన్‌

16 Nov, 2019 13:20 IST|Sakshi

రియాలిటీ షోలతో, రేడియో జాకీగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ఆయుష్మాన్‌ ఖురానా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తొలి సినిమా ‘విక్కీ డోనర్‌’  నుంచి తాజాగా విడుదలైన బాలా మూవీ వరకు సమకాలీన సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సాగే కథలు ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరొందాడు. గతేడాది బదాయీ హో, అంధాధున్‌లతో హిట్లు ఖాతాలో వేసుకున్న ఆయుష్మాన్‌.. తాజాగా బాలాతో 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మూవీ యూనిట్‌ సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో బాలా సినిమాలో అతడికి జోడీగా కనిపించిన భూమీ ఫడ్నేకర్‌ ఆయుష్మాన్‌తో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తానన్నారు.

ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో భూమి మాట్లాడుతూ.. ‘ తెరపై మా జంట చూడముచ్చటగా ఉంటుందని ఎంతో మంది కితాబిచ్చారు. మా మధ్య మంచి కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అందుకేనేమో మూడు సినిమాల్లో జంటగా కనిపించినా ఇప్పటికీ మాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. తనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో భాగం కావడం మరో విశేషం. వీటి ద్వారా ఎంతోమంది ఎదుర్కొనే సమస్యలను వినోదం కలగలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సఫలమయ్యాం’ అని పేర్కొన్నారు. కాగా భూమి ఫడ్నేకర్‌ తొలి సినిమా దమ్‌ లగా కే హైసాలో ఆయుష్మాన్‌ హీరో అన్న సంగతి తెలిసిందే. బాడీ షేమింగ్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి శుభ్‌ మంగళ్‌ సావధాన్‌(పురుషుల్లో సంతానలేమి ఇతివృత్తంగా), బాలా (బట్టతల కారణంగా యువకుడు పడే ఆవేదన ప్రధానాంశంగా) సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా