చిన్న వయస్సులోనే నిర్ణయం తీసుకున్నా: భూమి

10 Jun, 2020 15:48 IST|Sakshi

బాలీవుడ్‌ భామ భూమి పెడ్నేకర్‌

‘‘అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అంతే. నాలో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. విజయం నన్ను ఏమాత్రం మార్చలేదు! నేనింకా బలహీనురాలినే అనిపిస్తుంది. ఇప్పటికీ నా కళ్లలో కలలు అలాగే ఉన్నాయి. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎందుకంటే నటిగా మారాలనుకున్నపుడు నాది చాలా చిన్న వయస్సు. ఇప్పుడిప్పుడే జీవితంలో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద కలలు ఉన్నాయి’’ అంటూ బాలీవుడ్‌ భామ భూమి పెడ్నేకర్‌ తన కెరీర్‌ తొలినాటి అనుభవాలు గుర్తు చేసుకున్నారు. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకుంటానని చెప్పుకొచ్చారు. 

కాగా నటన నేర్చుకునేందుకు 15 ఏళ్ల వయస్సులోనే సుభాష్‌ఘాయ్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరిన భూమి.. ఫీజు కట్టలేక ఓ ఏడాది తర్వాత ఆ కోర్స్‌ మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక పరిణామాల అనంతరం మనీష్‌ శర్మ నిర్మించిన ‘దమ్‌ లగా కే హైస్సా’తో తెరంగేట్రం చేసి నటి కావాలన్న తన కలను సాధించారు. సినిమా కోసం ఏకంగా 12 కిలోల బరువు పెరిగి పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇక తొలి సినిమాలో బొద్దుగా కనిపించిన భూమి.. ఆ తర్వాత నాజూకుగా మారి శుభ్‌ మంగళ్‌ సావధాన్‌, టాయిలెట్‌: ఏక్‌ప్రేమ్‌ కథా, పతీ పత్నీ ఔర్‌, బాలా సినిమాలతో నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతూనే పలు హిట్స్‌ తన ఖాతాలో వేసుకున్నారు. (వ్యవసాయం చేస్తున్నా)

ఈ విషయాల గురించి భూమి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘‘అదృష్టవశాత్తూ నాకు అవకాశాలు దక్కాయి. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌తో ఇండస్ట్రీకి పరిచయం కావడం అదృష్టం. పదిహేడేళ్ల వయసులో అసలేం ఏం చేస్తున్నానో తెలియకుండానే తొలి సినిమా పూర్తి చేశాను. ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే నేను విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేసి సెటిల్‌ అవ్వాలని అనుకున్నాను. కానీ నన్ను విదేశాల్లో చ0దివించే స్థోమత నా తల్లిదండ్రులకు లేదని నాకు తెలుసు. అయితే ఒక్క సినిమాతో నా జీవితం మారిపోయింది. నేను మాత్రం మారలేదు’’అని హుందాతనాన్ని చాటుకున్నారు.  ఆది నుంచి సామాజిక అంశాలకు వాణిజ్య హంగులు జోడించిన సినిమాల్లో నటించడం తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కాగా భూమి ప్రస్తుతం... తెలుగులో హిట్‌ సాధించిన అనుష్క ‘భాగమతి’ హిందీ రీమేక్‌ ‘దుర్గావతి’లో  నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు