ధోనితో రీఎంట్రీ

18 Nov, 2015 13:16 IST|Sakshi
ధోనితో రీఎంట్రీ

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భూమికా చావ్లా తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటోంది. గ్లామర్ క్యారెక్టర్స్తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతమైన చిత్రాల్లోనటించిన భూమిక బాలీవుడ్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.

విజయవంతమైన భారత క్రికెట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో భూమిక మరోసారి వెండితెరమీద దర్శనమివ్వనుంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాలో భూమిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు చిత్రయూనిట్.

బాలీవుడ్లో తేరేనామ్, గాంధీ మై ఫాదర్, రన్ లాంటి సినిమాల్లో నటించిన భూమిక నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ప్రస్తుతానికి బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నభూమిక సరైన క్యారెక్టర్ దొరికితే సౌత్లో కూడా ఎంట్రీకి రెడీ అంటోంది.