‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

4 Aug, 2019 12:35 IST|Sakshi

యథార్థ అంశాలు ఆధారంగా తెరకెక్కిన ‘బైలంపుడి’ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. చీడికాడ మండలంలోని బైలంపుడి గ్రామంలో జరిగిన వాస్తవ విషయాలు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సబ్బవరానికి చెందిన అనిల్‌ పల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు వాస్తవ అంశాలను సినిమాగా మలచడంలో విజయవంతం అయ్యారు. తద్వారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శనివారం ఆయన సబ్బవరం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నారు.

సినిమా రంగం వైపు ఎలా వెళ్లారు?
తొలి నుంచి సినిమాలపై నాకు ఆసక్తి ఉంది. అందుకే హైదరాబాద్‌ వెళ్లాను. ఏడాది కాదు రెండు ఏళ్లు కాదు 20 ఏళ్లు ఒంటరి పోరాటం చేశా. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. కెమెరా మెన్‌గానే 20 ఏళ్ల పనిచేశాను. చాలా కష్టపడ్డాను.. కష్టాలు పడ్డాను. బైలంపుడి విజయం నాకు చాలా సంతోషాన్ని అందించింది.

కెమెరా మెన్‌గా ఎలా మారారు?
వాస్తవానికి సినిమాల్లో నటించాలనేది నా కోరిక. ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్‌ వెళ్లా. అయితే అనుకోకుండా కెమెరా డిపార్టుమెంట్‌లో చేరడం జరిగింది. అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా నా సినీ ప్రయాణం మొదలైంది. డాక్యుమెంటరీలు, సీరియళ్లు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగా. ప్రముఖ చాయాగ్రాహకులు వీఎస్‌ఆర్‌ స్వామి, ఎంవీ రఘుతో పాటు మరికొంతమంది ప్రముఖుల వద్ద అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా, అసోసియేట్‌ కెమెరా మెన్‌ పనిచేసే అదృష్టం దొరికింది.

దర్శకుడిగా ఎందుకు మారాలనిపించింది?
దర్శకత్వం అంటే నాకు కొంత ఇష్టం కొనసాగేది. కొంతమంది పెద్దల ప్రోత్సాహంతో దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. తద్వారా ఇటు వైపు వచ్చా. దర్శకత్వం చాలా పెద్ద సవాల్‌. జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. 30 చిత్రాలలో అసిస్టెంట్‌ కెమేరామెన్, అసోసియేట్‌ కెమేరామెన్‌ పనిచేశాను. మొదటి సారిగా ప్రభాష్‌ హీరోగా నటించిన అడవిరాముడు సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. స్వర్ణ సుబ్బారెడ్డి దర్శకత్వంలో వచ్చిన విజయేంద్రవర్మ, నితిన్‌ నటించిన అల్లరిబుల్లోడు చిత్రాలకు అసోసియేట్‌ కెమెరామెన్‌గా ఉన్నాను. అలాంటి తరుణంలో పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మాతగా నాకు దర్శకుడిగా అవకాశం కల్పించారు. ఆయన నన్ను ప్రోత్సహించారు.

బైలంపుడి చిత్రం తీయడం వెనుక నేపథ్యం ఏమిటి?
జిల్లాలోని చీడికాడ మండలంలోని ఓ గ్రామం బైలంపుడి. ఇక్కడ గంజాయి వ్యాపారం అధికంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కథను తీసుకోవడం జరిగింది. అక్కడ జరిగిన పలు యధార్థ ఘటనల ఆధారంగానే సినిమా తీశా. కేవలం 28 రోజుల్లో సింగిల్‌ షెడ్యూల్‌తో చిత్రీకరణ చేయడం జరిగింది. ఇది నాకు సంతోషాన్ని ఇచ్చింది. సినిమాకు రూ.కోటి 60 లక్షలతో చిత్రం పూర్తి చేశాం. చోడవరంలోని లక్ష్మీపురం, ద్వారకానగర్, అడ్డూరు, వెంకన్నపాలెం, సబ్బవరం మండలంల్లో బైలంపుడి చిత్రీకరణ జరిగింది. చోడవరం దగ్గర బంగారమ్మపాలెంకు చెందిన ఉత్తరకుమార్‌ ఈ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు?
బైలంపూడి సినిమాలో 20 మంది కళాకారులకు అవకాశం కల్పించాను. సినిమా విజయవంతానికి వారంతా సంపూర్ణ సహకారం అందించారు. చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. నిర్మాత బ్రహ్మానందరెడ్డితో పాటు యూనిట్‌ సభ్యులంతా సంతోషంతో ఉన్నాం. ప్రస్తుతం కొంతమంది నిర్మాతలు అవకాశాలు ఇస్తామని ముందుకు వచ్చారు. దానిపై కసరత్తు జరుగుతోంది. మంచి కథను తయారు చేసుకునే పనిలో ఉన్నా. వచ్చిన ఏ అవకాశాన్ని వదలకూడదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు దూసుకుపోవాలి.

మరిన్ని వార్తలు