13 కోట్లు కొల్లగొట్టిన 'బిచ్చగాడు'

16 Jun, 2016 12:16 IST|Sakshi
13 కోట్లు కొల్లగొట్టిన 'బిచ్చగాడు'

డబ్బింగ్ సినిమాల హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ సృష్టించాడు బిచ్చగాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఓ సాదాసీదా సినిమాగా టాలీవుడ్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన బిచ్చగాడు. భారీ వసూళ్లతో సంచలనం సృష్టించాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లు కూడా మెప్పించలేకపోయిన సీజన్లో ఈ కోలీవుడ్ ఎంటర్ టైనర్ హిట్ టాక్తో మంచి కలెక్షన్లు సాధించింది. తమిళ హీరో విజయ్ ఆంటోని లీడ్ రోల్లో శశి దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు తెలుగు నాట కూడా ఘనవిజయం సాధించింది.

పిచ్చెకారన్ అనే పేరుతో కోలీవుడ్లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ను 30 లక్షలకు సీనియర్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు సొంతం చేసుకున్నారు. డబ్బింగ్తో పాటు ప్రమోషన్ లాంటి ఇతర కార్యక్రమాలన్నింటికీ కలిపి దాదాపు 50 లక్షల వరకు ఖర్చయ్యిందన్న టాక్ వినిపిస్తోంది.

సమ్మర్ సీజన్లో రిలీజ్ అయిన బిచ్చగాడు తెలుగునాట కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఏకంగా 13 కోట్ల వసూళ్లను సాధించింది. అంటే దాదాపుగా పెట్టుబడికి 25 రెట్లు సాధించిన బిచ్చగాడు డబ్బింగ్ సినిమాల చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు.