బిగ్‌బాస్‌ ఇంట్లో కెప్టెన్సీ కోసం కొట్లాట!

5 Dec, 2019 11:43 IST|Sakshi

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ 13 హిందీ సీజన్‌లో బుధవారం కెప్టెన్సీ టాస్క్‌ జరిగింది. కానీ అది హింసాత్మకంగా సాగడంతో అందుకు కారణమైన ఇద్దరినీ బిగ్‌బాస్‌ టాస్క్‌ నుంచి తొలగించాడు. నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులు అందరూ చయ్యా చయ్యా వంటి ఎనర్జిటిక్‌ పాటతో నిద్ర లేచారు. కానీ కొందరు మాత్రం బద్ధకంగా ఇంకా బెడ్‌ మీద నుంచి దిగకపోవడంతో బిగ్‌బాస్‌ వారు లేచేవరకు కోడి కూత శబ్ధాన్ని వినిపిస్తూనే ఉన్నాడు. అనంతరం బిగ్‌బాస్‌ కెప్టెన్సీటాస్క్‌కు అనర్హులైన ఇద్దరి పేర్లు చెప్పమని ఇంటి సభ్యులను ఆదేశించాడు. చర్చల తర్వాత మెజారిటీ ఇంటి సభ్యులు సిద్ధార్థ్‌ శు​క్లా, విశాల్‌ ఆదిత్య సింగ్‌ పేర్లు వెల్లడించారు. కోపోద్రిక్తుడైన సిద్ధార్థ్‌ అక్కడ నుంచి విసవిసా వెళ్లిపోయాడు. అయితే, గాయం కారణంగా కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనని పారాస్‌ స్థానంలో సిద్ధార్థ్‌ ఆడాడు. ఇక ఈ టాస్క్‌లో ఇతరుల వస్తువులను దొంగిలించి రైలు లోపలికి చేరుకోవాలి.

చివరి బజర్‌ మోగే సమయానికి ఎవరు ప్లాట్‌ఫార్మ్‌పై ఉంటారో వారు ఆట నుంచి నిష్క్రమించినట్టు లెక్క. ఈ టాస్క్‌ పక్కవాళ్ల బ్యాగులను దొంగిలించే క్రమంలో హింసాత్మకంగా మారింది. సిద్ధార్థ, అసిమ్‌ మధ్య మాటల యుద్ధం పెరిగి పోట్లాడుకున్నారు. ఒకరినొకరు కిందకు తోసుకున్నారు. ఆఖరు బజర్‌ మోగే సమయానికి అసిమ్‌, సిద్ధార్థ్‌, షెహనాజ్‌ రైలు బయటే ఉండటంతో బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను హెచ్చరిస్తాడు. ఆ తర్వాత షెహనాజ్‌ రైలు లోపలికి ప్రవేశించగా అసిమ్‌, సిద్ధార్థ్‌ బయటే ఉండి వారి పోట్లాటను ఇంకా కొనసాగించారు. దీంతో బిగ్‌బాస్‌ వారిద్దరినీ కెప్టెన్సీ టాస్క్‌ నుంచి తొలగించినట్టుగా ప్రకటిస్తాడు. బిగ్‌బాస్‌ ప్రారంభంలో మంచి స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ రానురానూ శత్రువులుగా మారిపోయారు. మరి వారి గొడవ ప్రోమోలోనే ఈ విధంగా ఉంటే ఎపిసోడ్‌లో ఇంకెంత హీటెక్కనుందో చూడాలి! అయితే గొడవ అనంతరం సిద్ధార్థ ఏడ్చాడంటూ దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సిద్ధార్థకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు