బిగ్‌బాస్‌ : ప్రేక్షకుల సహనానికి పరీక్ష

25 Aug, 2018 09:12 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఏదైనా జరుగొచ్చు. అంటే ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించరు. ఈవారం అంతా ప్రేక్షకులకు అసహనం కలిగించేలా షోను నడిపించారు నిర్వాహకులు. మళ్లీ ఆ ప(స)ని లేని పెళ్లి టాస్క్‌లో ఇచ్చిన సీక్రెట్స్‌ విరక్తి పుట్టించేలా ఉన్నాయి. ఈ వారం జరిగిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. 

బిగ్‌బాస్‌లో ఈ వారం ఓ బొమ్మల పెళ్లి జరిగింది. కాదు కాదు బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు హౌస్‌మేట్స్‌ జరిపించారు. మెహందీ, సంగీత్‌, పెళ్లి, శోభనం అంటూ ప్రేక్షకులకు చిర్రెత్తించేలా చేశారు హౌస్‌మేట్స్‌. ఏ ఒక్కరూ తగ్గకుండా అందరూ తమ అతితో నటించేశారు. ఈ వారం గీతా మాధురిపై పెరిగనంత వ్యతిరేకత మిగతా ఏ కంటెస్టెంట్‌పై పెరిగి ఉండకపోవచ్చు. వీరు చేసే ఈ అతిలో కాస్త ఉపశమనంగా హౌస్‌లో అనసూయ, నీవెవరో టీమ్‌ కనిపించి కనువిందు చేశారు. మెహింది కార్యక్రమాని​కి హాజరైన అనసూయ హౌస్‌మేట్స్‌ అందరికీ మెహిందిని పెట్టారు. ఒక్కొక్కరు తమకిష్టమైన పేర్లను చేతిపై వేయించుకున్నారు. అనసూయ ఉన్నంత సేపు హౌస్‌ కాస్త కలర్‌ఫుల్‌గా ఉంది. అటు తరువాత సంగీత్‌ కార్యక్రమం అంటూ హౌస్‌ మేట్స్‌ డ్యాన్సులతో చిందేశారు. 

గీతా మాధురిని ముద్దు పెట్టుకోవాలంటూ రోల్‌ రైడాకు సీక్రెట్‌ టాస్క్‌ ఇవ్వగా.. సామ్రాట్‌ కూడా పనిలో పనిగా ముద్దు పెట్టేశాడు. ఇక దీనిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ గురించి చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా గీతపై నెటిజన్లలో వ్యతిరేకత తీవ్రస్థాయి కి చేరుకున్నట్టు కనిపిస్తోంది. సామ్రాట్‌, రోల్‌, తనీష్‌లో నందు కనిసిస్తున్నాడని చెప్పిన గీతపై నెటిజన్లు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. 

సందులో సడేమియా అన్నట్లు ఈ టాస్క్‌లో గణేష్‌ కూడా రెచ్చిపోయాడు. పెళ్లి పంతులు క్యారెక్టర్‌లో లీనమయ్యాడు. మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌ అన్ని మార్చేసి కంటెస్టెంట్లతోనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌తో మాట్లాడే తీరే మారిపోయింది. ఈ విషయంపై తనీష్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై కౌశల్‌, తనీష్‌ ఇద్దరు చర్చించుకున్నారు. గణేష్‌ డల్‌గా ఉండటం చూసి మిగతా కంటెస్టెంట్లు జాలి పడటం.. ఏం జరిగిందో అడగటం... తనీష్‌ దగ్గరికి వెళ్లి సారీ చెప్పడం ఇలా జరిగిపోయింది. ఈ పెళ్లి టాస్క్‌ ముగిసిన తరువాత నీవెవరో టీమ్‌ బిగ్‌బాస్‌లో ఆర్జేలుగా మారి అల్లరి చేశారు. గణేష్‌-అమిత్‌-దీప్తిలు చేసిన గుడ్డు టాస్క్‌, కౌశల్‌-గీత చేసిన టాస్క్‌లు బాగానే వర్కౌట్‌ అయ్యాయి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ పాత్రలో కౌశల్‌, అతని ప్రేయసిగా గీత చేసిన ఫన్‌ బాగుంది. ఇక్కడ కూడా రోల్‌ తన ర్యాప్‌ను ప్రదర్శించేశాడు. రోల్‌ ర్యాప్‌లపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ సంగతి తెలిసిందే. 

ఇక ఈ సారి కెప్టెన్‌ టాస్కులో భాగంగా.. కన్ఫెషన్‌ రూమ్‌లోకి ముందుగా వెళ్లిన ఇద్దరు సభ్యులను అర్హులని బిగ్‌బాస్‌ ‍ప్రకటించారు. ఎప్పటినుంచో కెప్టెన్సీ పోటీదారుగా పాల్గొని వెనుదిరిగిన దీప్తి ఈ సారి కెప్టెన్‌ అవ్వాలని పట్టుదలగా ఉంది. దీప్తి మొదట వెళ్లి కూర్చోగా.. కౌశల్‌, పూజల మధ్య వాగ్వాదం జరిగింది. చివరగా పూజ లేచి వెళ్లిపోగా.. దీప్తి, కౌశల్‌ కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించారు. తమకు కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్‌ చేయాలని మిగతా హౌస్‌మేట్స్‌ను అడగడం మొదలెట్టారు. ప్రేక్షకులందరికి తెలిసిందే ఎవరు ఎవరికి సపోర్ట్‌ చేస్తారని.. కౌశల్‌కు అమిత్‌ తప్ప ఎవరూ సపోర్ట్‌ చేయలేదు. ఈ టాస్క్‌పై తనీష్‌ సహాయాన్ని కోరగా.. దీప్తికి తాను మాటిచ్చానని, తనకే సపోర్ట్‌ చేస్తానని చెప్పాడు. అందరూ తననే సపోర్ట్‌ చేస్తే ఇక టాస్క్‌ ఎందుకు ఏకగ్రీవంగా ప్రకటించొచ్చుకదా అని కౌశల్‌ తనీష్‌తో చెప్పుకొచ్చాడు.

తాను ముందు నుంచీ అదే చెబుతున్నానని, హౌస్‌లో అందరితో కలిసి ఉండటం ముఖ్యమని ఎన్నో సార్లు చెప్పానని కౌశల్‌తో తనీష్‌ అన్నాడు. కౌశల్‌కు బయట సపోర్ట్‌ ఉంది గానీ, ఇంటి లోపల ఏ ఒక్క కంటెస్టెంట్‌ కూడా సపోర్ట్‌ చేయడం లేదు. ఒక రకంగా ఇదే ప్రేక్షకుల్లో కౌశల్‌పై సానుభూతిని కలిగేలా చేసింది. అయినా ఇంటి సభ్యుల మద్దతు లేకుండా ఇంట్లో నెగ్గుకురావడం చాలా కష్టమే. ఇద్దరు కెప్టన్సీదారులకి మద్దతుగా.. హౌస్‌మేట్స్‌ తమ వస్తువులు, వాటి బరువుతో కెప్టెన్‌ను కొనుక్కోవాలని బిగ్‌బాస్‌ తెలిపాడు. కౌశల్‌కు సపోర్ట్‌గా ఎవరూ ఏ వస్తువును వేయలేదు. ఈ విషయంలో కౌశల్‌కు మద్దతుగా అమిత్‌ ఒంటరిపోరాటం చేశాడు. 

చివరికి ఈ టాస్క్‌లో దీప్తి గెలిచింది. బిగ్‌బాస్‌లో తన చిరకాల కోరిక నెరవేరినందుకు చాలా సంతోషంగా కనిపించింది. అనూహ్యంగా నూతన్‌ నాయుడు మళ్లీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. నూతన్‌ ఎంట్రీతో ముందు సంబరపడినా.. మళ్లీ అతనిపై చర్చ జరిగింది. గత వారం ఎలిమినేషన్‌లో లేడు, ఈ వారం నామినేషన్‌లో లేడు అంటూ ఏవెవో లెక్కలు వేసేసి మిగతా వారికి వివరిస్తున్నాడు తనీష్‌. ఈ వారం కష్టపడిందంతా వృథానేనా అంటూ తనీష్‌ చెప్పుకొచ్చాడు. 

ఏదేమైనా ఈవారం షో మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పటి వరకు షో ఎలా జరిగినా.. ఎలిమినేషన్‌లో మాత్రం ఈ సారి దీప్తి వెళ్లిపోతుందని అనుకున్నా.. కెప్టెన్‌గా మారడంతో ఈ సారి పూజ వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. అయినా ఈ సస్పెన్స్‌ కూడా ఎక్కువసేపు ఉండదు కదా.. ఎందుకంటే శనివారం రాత్రికల్లా ఎవరూ ఎలిమినేట్‌ కానున్నారో లీకుల ద్వారా బయటకు వస్తుంది. మరి చూద్దాం.. ఎవరు బయటకు వెళ్లనున్నారో.. ఎందుకంటే ఇది బిగ్‌బాస్‌.. ఏదైనా జరుగొచ్చు!.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా