బిగ్‌బాస్‌ : గాయంతో నూతన్‌ ఔట్‌!

18 Aug, 2018 08:43 IST|Sakshi

ఏదైనా జరుగొచ్చు అంటే ఏంటో శుక్రవారం నాటి బిగ్‌బాస్‌ కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది. అంతా సరిగానే ఉందనకునే సమయానికి టాస్క్‌లో నూతన్‌ నాయుడికి గాయం అవడం.. అతన్ని హౌస్‌ నుంచి బయటకు పంపేస్తున్నట్లు బిగ్‌బాస్‌ తెలపడం.. హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలేం ఏం జరిగిందో చూద్దాం.. పబ్లిక్‌ కాలర్స్‌ వర్సెన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ కాల్‌ సెంటర్‌ టాస్క్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్‌ ఇచ్చిన కంటెస్టెంట్లుగా కౌశల్‌, రోల్‌ రైడాలను హౌస్‌మేట్స్‌ ఎంచుకున్నారు. అనంతరం వీరిద్దరికి కెప్టెన్సీ టాస్క్‌ను వివరించాడు బిగ్‌బాస్‌. 

‘గార్డెన్‌ ఏరియాలో ఉన్న రెండు టేబుల్స్‌పై రెడ్‌, గ్రీన్‌ బాక్సులు ఉంటాయి. ఆ బాక్సులతో పిరమిడ్‌ నిర్మించాలి. ఆ క్రమంలో మిగతా హౌస్‌మేట్స్‌ వాటిని కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బజర్‌ మోగే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ బాక్సులు, పిరమిడ్‌ ఆకారంలో పేర్చి కాపాడుకుంటారో వారే విజేతలు. ఈ టాస్కుకు పూజ సంచాలకులుగా వ్యవహరిస్తార’ని టాస్క్‌ను వివరించాడు. 

ఇక ఈ ఆటలో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారన్న విషయం తెలిసిందే. బజర్‌ మోగగానే.. కౌశల్‌ గ్రీన్‌ బాక్సులున్న టేబుల్‌ను ఎంచుకుని పిరమిడ్‌ను నిర్మిస్తుండగా.. గణేష్‌, తనీష్‌, సామ్రాట్‌, అమిత్‌లు అందరూ కలిసి కౌశల్‌ను చుట్టుముట్టేశారు. ఏకధాటిగా బంతుల వర్షం కౌశల్‌పై కురిపించారు. మరో వైపు రోల్‌ రైడాను టార్గెట్‌ చేస్తూ... గీత, దీప్తి, శ్యామల బంతులను గురి పెట్టారు. కానీ, వారి ప్రయత్నం అంతగా ఫలించలేదు. ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న రోల్‌రైడా పిరమిడ్‌ను నిర్మించేసి.. గట్టిగా పట్టుకుని కాపాడుకుంటూ ఉన్నాడు. 

కౌశల్‌ పిరమిడ్‌ను నిర్మించడం సంగతేమో కానీ, కనీసం ఆ బాక్సులను కూడా కాపాడుకోలేకపోయాడు. ఇక కౌశల్‌ మద్దతుదారులైన గీత, శ్యామల, నూతన్‌ల సలహా మేరకు ఆడుతూ.. కిందపడిపోయిన బాక్సులను తీసుకుంటూ.. వాటిని పిరమిడ్‌లా పేర్చుతూ ఉన్నాడు. ఇక రోల్‌ రైడాను ఏమాత్రం టార్గెట్‌ చేయని తనీష్‌, సామ్రాట్‌, గణేష్‌, అమిత్‌లు.. కౌశల్‌ను మాత్రం గట్టిగానే రౌండప్‌ చేశారు. 

కౌశల్‌ స్నేహితుడైన నూతన్‌.. రోల్‌ రైడా నిర్మించి, కాపాడుకుంటున్న పిరమిడ్‌ను కూల్చే ప్రయత్నం చేశాడు. రోల్‌ రైడాపై ధాటిగా బంతులతో దాడి చేశాడు. నూతన్‌ ఈ క్రమంలో పూజతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మళ్లీ రోల్‌ రైడాను టార్గెట్‌ చేసి బంతులు విసురుతుండగా.. నూతన్‌ భుజానికి గాయమైంది. అంతకు ముందే అతని భుజానికి గాయమైందని తెలిపిన నూతన్‌ను.. తనీష్‌, గణేష్‌లు కన్‌ఫెషన్‌ రూమ్‌కు తీసుకెళ్లారు... వైధ్యుల బృందం వచ్చి పరీక్షించసాగారు. 

ఈ సమయంలో కౌశల్‌కు కొంత సమయం దొరికింది కానీ.. సామ్రాట్‌, అమిత్‌ల ధాటికి వాటిని కాపాడుకోవడం కష్టమైంది. ఇక టాస్క్‌ ముగిసే సమయానికి కౌశల్‌ 69, రోల్‌ రైడా 76 బాక్సులతో పిరమిడ్‌ను నిర్మించారు. ఈ టాస్క్‌లో రోల్‌ రైడా విజయం సాధించినట్లు పూజ బిగ్‌బాస్‌కు తెలిపింది. 

అనంతరం.. కన్‌ఫెషన్‌ రూమ్‌లో ఉన్న నూతన్‌కు.. తీవ్రగాయమైనందువల్ల, వైద్యుల సలహా మేరకు తనను బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు పంపి వైద్యం అందించాలనుకుంటున్నామని బిగ్‌బాస్‌ తెలిపాడు. కౌశల్‌ను కన్‌ఫెషన్‌ రూమ్‌కు రావాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. తనను హౌస్‌లోంచి బయటకు వెళ్లమంటున్నారని నూతన్‌ కౌశల్‌కు తెలిపాడు. అనంతరం ఇంటి సభ్యులందరికి...నూతన్ భుజానికి తీవ్ర గాయమైనందున నూతన్‌ను హౌస్‌ నుంచి బయటకు పంపేస్తున్నామని బిగ్‌బాస్‌ తెలిపాడు. ఒకవైపేమో.. నూతన్‌ను సీక్రెట్‌ రూమ్‌లో ఉంచారని.. మళ్లీ ఇంటిలోకి వస్తారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

మరి ఈ వారం ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్న నూతన్‌ నాయుడు, దీప్తి సునయన, రోల్‌ రైడా, పూజా రామచంద్రన్‌, శ్యామల, గీతా మాధురి,లో ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. దీప్తి సునయన ఎలిమినేట్‌ కానుందని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనపై పెరిగిన నెగెటివిటినే ఇందుకు కారణం కావొచ్చని తెలుస్తోంది. మరి ఇంతకి ఎవరు ఎలిమినేట్‌ కానున్నారో, ఏం జరుగనుందో చూడాలి. ఎందుకంటే ఇది బిగ్‌బాస్‌.. ఏదైనా జరుగొచ్చు.

మరిన్ని వార్తలు