బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

17 Oct, 2019 11:05 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో గ్రూప్‌లు మారిపోయినట్టు కొట్టొచినట్టు కనిపిస్తోంది. రాహుల్‌.. శివజ్యోతి, అలీ రెజా ఒక గ్రూప్‌... శ్రీముఖి, బాబా భాస్కర్‌, వరుణ్‌, వితిక మరో గ్రూప్‌గా మారిపోయారు. అయితే ఇదంతా నామినేషన్‌ ఎఫెక్ట్‌ అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక  బిగ్‌బాస్‌ ఇంట్లోకి హౌస్‌మేట్స్‌ కుటుంబీకులను పంపిస్తూ అందరికీ బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈపాటికే వితిక చెల్లెలు రితిక అందరినీ పలకరించి వెళ్లింది. తాజా ఎపిసోడ్‌లో అందరూ స్లీప్‌ మోడ్‌లో ఉన్న సమయంలో అలీ భార్య మసుమా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే వచ్చింది మసుమా అని శివజ్యోతి గుర్తుపట్టింది. స్లీప్‌ మోడ్‌ రివీల్‌ చేసిన తర్వాత అలీతో బయట జరుగుతున్న వాటికోసం కబుర్లు చెప్పింది. ‘వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీకి ముందున్న అలీ కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని.. నాకు అదే కావాలని కోరింది. బంధాల్లో ఇరుక్కుపోకుండా నీ గేమ్‌ నువ్వు ఆడు..’ అని అలీకి చురకలు అంటించింది.

తర్వాత వచ్చిన మరో అతిథి గంగూలీని చూడగానే శివజ్యోతి కన్నీటి పర్యంతం అయింది. శివజ్యోతిని దగ్గరికి తీసుకుని బాగా ఆడుతున్నావ్‌ అంటూ గంగూలీ ధైర్యం చెప్పాడు. కాసేపు రాహుల్‌, అలీ శివజ్యోతిని ఆటపట్టించగా.. ఏయ్‌, మా ఆయన ఉన్నాడు అంటూ రెచ్చిపోయింది. అయితే తను లేనందుకు గంగూలీ కొంచెం కూడా బాధపడట్లేదని శివజ్యోతి ఫీల్‌ అయింది. ఏడుస్తూనే భర్తను సాగనంపింది. తర్వాత బాబా భాస్కర్‌ వంతు వచ్చింది. ముందుగా వారి పిల్లలను, తర్వాత భార్య రేవతిని ఇంట్లోకి పంపించారు. ఏంటి.. ఇంత మేకప్‌ వేసుకున్నారు అంటూ బాబా వాళ్లని ఆటపట్టించాడు. ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ సైతాన్‌ అని శ్రీముఖిని చూపించాడు.

అనంతరం కుటుంబం అంతా కలిసి కాసేపు హాయిగా ముచ్చటించారు. ఎందుకు అన్నిసార్లు ఏడ్చారు అని రేవతి.. బాబాను ప్రశ్నించింది. ‘బిగ్‌బాస్‌ షో ఎలా ఉంటుందో చూద్దాం అని వచ్చాను.. కానీ ఇక్కడ అందరూ నేను గేమ్‌ ఆడుతున్నానని అనేసరికి కష్టం అనిపించి ఏడ్చాన’ని చెప్పాడు. వెళ్లిపోయే ముందు రేవతి మాట్లాడుతూ ఎప్పుడూ బాబానే మూడుపూటలా వంట చేస్తాడు.. అసలు మీరెవరూ చేయరా అని నిలదీసింది. అసలు వితిక, శివజ్యోతిలను వంట వచ్చా? కిచెన్‌లో శ్రీముఖి కేవలం గరిటె ఊపుతుంది.. అని కామెంట్‌ చేసింది. అయితే  బాబా మమ్మల్ని ఎవరినీ వంట చేయనివ్వడని ఇంటి సభ్యులు సమాధానమిచ్చారు. కాగా ముచ్చటగా మరో ముగ్గురి ఇంటి సభ్యుల బంధువులు ఇంకా రావాల్సి ఉంది. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు తమాయించుకుంటారో, ఏడ్చేస్తారో లేదో చూడాలి!

మరిన్ని వార్తలు