ఆ స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చా: జాఫర్‌

8 Nov, 2019 10:47 IST|Sakshi

జాఫర్‌ బాబు.. బిగ్‌బాస్‌ షోలో ఉన్నది రెండువారాలైనా తనలోని మరో యాంగిల్‌ను చూపించాడు. బాబా భాస్కర్‌తో కలిసి ఆయన చేసే కామెడీకి అందరూ తెగ నవ్వుకునేవారు. షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాక కూడా తన మిత్రుడు బాబాకు జాఫర్‌ మద్దతుగా నిలిచాడు. ఇదిలాఉండగా.. తాజాగా బిగ్‌బాస్‌ షోపై జాఫర్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. జాఫర్‌ ఓ ఇంటర్య్యూలో.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 షో ఎలా జరిగిందనే ప్రశ్నకు... ‘కంటెస్టెంట్లు ఎలా ఆడారు..? బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల అనుభవాలేమిటీ..? ఇలా వీటిపై ఇంతగా చర్చ జరగాల్సిన అవసరం ఉందా? అని ఎదరు ప్రశ్నించారు. దీనివల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా?’ అని వ్యాఖ్యానించారు.

పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడమే మనిషి వీక్‌నెస్ అని.. ఆ బలహీనతే ఇలాంటి షోలు హిట్‌ అవడానికి కారణం అవుతాయని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. బిగ్‌బాస్‌ ప్రసారం అవుతున్న ఏడు రాష్ట్రాలతో పోలిస్తే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3కి విపరీతమైన రేటింగ్స్‌ వచ్చినట్టు నిర్వాహకులు ప్రకటించారని ఆయన గుర్తు చేశాడు. అయితే, ఇదేమీ గొప్ప షో కాదని, కేవలం బిజినెస్‌ గేమ్‌ అని తేలిగ్గా కొట్టిపారేశాడు. ‘బిగ్‌బాస్‌ షోకు ఆర్మీలు ఎందుకు’ అని జాఫర్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఇంటిసభ్యులు ఆడే ఆట కన్నా.. కంటెస్టెంట్లకు మద్దతుగా చేసే ఆడేఆటలు ప్రమాదకరంగా పరిణమించాయని చెప్పుకొచ్చాడు.

‘ఇలాంటి టీఆర్పీ రేటింగ్‌ గేమ్‌ షోల వల్ల అటు నిర్వాహకులకు లాభం.. అందులో పాల్గొన్న నాలాంటి కంటెస్టెంట్లకు లాభం. ఎందుకంటే వారం వారం పారితోషికం ఇస్తారు. దానికి తోడు పాపులారిటీ కూడా పెరుగుతుంది. ఎంతబాగా పాపులర్‌ అయితే అంతగా తాను చేసే డిబేట్స్‌ ఎక్కువమందికి రీచ్‌ అవుతాయనే స్వార్థంతోనే బిగ్‌బాస్‌ షోకు వచ్చాను’అని జాఫర్‌ తెలిపాడు. బిగ్‌బాస్‌ షో కోసం చర్చలు అనవసరమని భావించాను కాబట్టే తాను ఏ డిబేట్‌లోనూ పాల్గొనలేదని చెప్పుకొచ్చాడు.

అయితే, జాఫర్‌ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జాఫర్‌ ప్రవర్తిస్తున్నాడని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘బిగ్‌బాస్‌పై చర్చలు అనవసరమని చెప్పిన జాఫర్‌ బాబు.. షో ముగిసిన అనంతరం బాబా భాస్కర్‌ను ఇంటర్వ్యూ చేయడం ఎందుకని ట్రోల్‌ చేస్తున్నారు. ‘అతను చేస్తే ఒప్పు.. మిగతావాళ్లు చేస్తే తప్పా’ అంటూ మండిపడుతున్నారు. బిగ్‌బాస్‌ ప్రసారం అయినన్నాళ్లూ సైలెంట్‌గా ఉండి ఇప్పుడేమో షో వేస్ట్‌ అంటూ మాట్లాడటం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు. షో పూర్తయ్యేదాకా నోరు మెదపని జాఫర్‌ ఇప్పుడేమో అది కేవలం బిజినెస్‌ గేమ్‌ అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు