‘బిగ్‌బాస్‌ ఫలితం షో ప్రతిష్టను దిగజార్చింది’

5 Nov, 2019 14:42 IST|Sakshi

అతిరథ మహారథుల సమక్షంలో బిగ్‌బాస్‌ 3 తెలుగు షో విజేతను ప్రకటించారు. 105 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ సాధించాడు. ‘ఈసారి మహిళను గెలిపిద్దాం’ అంటూ ప్రచారం చేసిన శ్రీముఖి మాటలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌ కప్పు కొట్టకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసిన బాబా భాస్కర్‌ మూడో స్థానంలో నిలిచాడు. షో మొదటి నుంచి టైటిల్‌ గెలవడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనుకున్న వరుణ్‌ సందేశ్‌ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. టాస్క్‌ల్లో విజృంభించే అలీ రెజా అయిదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

బిగ్‌బాస్‌ ఫెయిల్‌ అయింది..
ఇక షో ముగిసినప్పటికీ రాహుల్‌ను విజేతగా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాహుల్‌ గెలుపుతో చిచ్చా ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగి తేలుతుంటే శ్రీముఖి అభిమానులు మాత్రం సోషల్‌ మీడియాలో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఒక బద్ధకస్తుడిని గెలిపించి బిగ్‌బాస్‌ 3 ఫెయిల్‌ అయిందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాహుల్‌ గెలుపు ఏకపక్షమని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్‌ చేసిన వ్యాఖ‍్యలు సంచలనంగా మారాయి. బిగ్‌బాస్‌ 2,3 ఫలితాలు బిగ్‌బాస్‌ షో ప్రతిష్టను దిగజార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బహుశా ఆ ఫలితాలు జనాల అభిప్రాయం కావచ్చని అసహనం వ్యక్తం చేశాడు. రాహుల్ గెలిచాడు.. కానీ బిగ్‌బాస్‌ ఓడిపోయిందని పేర్కొన్నాడు.

రాహుల్‌ గెలవడం స్త్రీ జాతికే అవమానం..
మహేశ్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖిని రన్నరప్‌గా ప్రకటించడంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక సోమరిపోతు, అహంకారిని బిగ్‌బాస్‌ విన్నర్‌గా చూడగలగడం.. ఆడపడుచుని అహంకారంగా అవమానపరిచిన వాడిని ఆమె ముందే విన్నర్‌ అనడం స్త్రీ జాతికే అవమానం’ అంటూ దుయ్యబడుతున్నారు. బిగ్‌బాస్‌ షోపై నమ్మకం పోయందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇకమీదట వచ్చే బిగ్‌బాస్‌ 4 చూడమంటూ పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా శపథం చేస్తున్నారు. బిగ్‌బాస్‌ 1లో పాల్గొన్న కత్తిమహేశ్‌ గతంలోనూ బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు