బిగ్‌బాస్‌: ప్రముఖ ఆంగ్ల దినపత్రికపై ఫిర్యాదు

29 Aug, 2019 12:00 IST|Sakshi

బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికపై శ్రీముఖి బంధువులు  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీముఖిని మాత్రమే టార్గెట్‌ చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం నిర్వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ట్విటర్‌ నకిలీ అకౌంట్లను పరిగణలోకి తీసుకొని ఆ పత్రిక వార్తలు రాస్తూ శ్రీముఖిపై దుష్ప్రచారం చేస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత రెండు వారాల నుంచి ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదని వారు పేర్కొన్నారు. 

రాహుల్‌ను ఎగతాళి చేస్తూ...
ఇక బిగ్‌బాస్‌ ఇంట్లో ....రాహుల్‌, శ్రీముఖిలు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. గత ఎపిసోడ్‌లో శ్రీముఖి రాహుల్‌ను బ్లాక్‌ షీప్‌ అని కామెంట్‌ చేసింది. రాహుల్‌ను ఎగతాళి చేస్తూ అన్న మాటలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఇది వర్ణ వివక్ష చూపించడమే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఓ టాస్క్‌లో అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకుని మరీ రాహుల్‌ను దూషించిన హిమజను కూడా అభిమానులు కడిగిపారేస్తున్నారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నాగార్జునను కోరుతున్నారు. ఇక రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన శ్రీముఖిని షో నుంచి తప్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలో శ్రీముఖి, హిమజల పట్ల దురుసుగా ప్రవర్తించిన రాహుల్‌, అలీలకు నాగ్‌ చురకలు అంటించిన విషయం తెలిసిందే. కానీ శ్రీముఖి, హిమజలు చేస్తున్న తప్పులను మాత్రం నాగ్‌ అసలు పరిగణలోకే తీసుకోవట్లేదని కొందరు అభిమానులు గుర్రుగా ఉన్నారు. కాగా గత ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల్లో ఎవరికైనా కోపం తెప్పించాలనే టాస్క్‌ను రాహుల్‌ ఎంచుకున్నాడు. టాస్క్‌ ఆడుతున్న సమయంలో హిమజ రాహుల్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించింది. చెప్పు తెగుతుంది అంటూ ఏకంగా కొట్టడానికే వెళ్లింది. మరి ఆడవారిని ఏమైనా అంటే ఊరుకోని నాగార్జున ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇంగ్లీష్‌ బిగ్‌బాస్ షోలో శిల్పాశెట్టి కూడా ఇలాంటి వర్ణ వివక్షను ఎదుర్కొంది. కాగా అలాంటి విద్వేషపూరిత మాటలు అన్న జేడ్‌గుడిని షో నుంచి అర్ధాంతరంగా బయటకు పంపించేశారు. మరి ఇక్కడ శ్రీముఖిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి!

మరిన్ని వార్తలు