బిగ్‌బాస్‌ : శివజ్యోతి ప్లాన్‌ సక్సెస్‌ అయినట్టేనా!

15 Oct, 2019 21:13 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు 3 సీజన్‌ చివరి అంకానికి చేరింది. సీజన్‌ ముగింపునకు రోజులు దగ్గర పడుతున్నకొద్దీ బిగ్‌బాస్‌ గేమ్‌ కఠినతరం చేసేందుకు శ్రమిస్తున్నాడు. ఇక ఇంటి సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే గేమ్‌ను సీరియస్‌గా తీసుకుంటూ ట్రాక్‌లోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. బిగ్‌బాస్‌ పదమూడో వారం నామినేషన్‌ ప్రక్రియలో ఇంట్లో కుంపటి పెట్టాడు. ‘టాపర్‌ ఆఫ్‌ ద హౌస్‌’ టాస్క్‌పెట్టి..  మీలో మీరే ఎవరు తోపు అనేది తేల్చుకోండి అంటూ బిగ్‌బాస్‌ ఆదేశించాడు. మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు సేవ్‌ అవుతారని, మిగతా నాలుగు స్థానాల్లో ఉన్నవాళ్లు నామినేషన్‌కు వెళ్తారని చెప్పారు. ఇక ఈ టాస్క్‌లో రాహుల్‌, శ్రీముఖి ఒకరి మీద ఒకరు వీర లెవల్లో వాదులాటకు దిగారు. కానీ చివరికి బాబా తన మొదటి స్థానాన్ని శ్రీముఖికి ఇవ్వడంతో ఈ గొడవ సమసిపోయింది.

ఇక శివజ్యోతి.. తన లక్కీ నంబర్‌ మూడంటూ ఆ స్థానం తనకు కావాల్సిందేనని పట్టుబట్టింది. వరుణ్‌.. తన మూడో స్థానాన్ని శివజ్యోతికి ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. అయితే వితిక వచ్చి అడగ్గానే తను పక్కకు తప్పుకుని మూడో స్థానాన్ని ఆమెకు అప్పగించాడు. ఇది మింగుడుపడని శివజ్యోతి వారిద్దరితో వాదనకు దిగింది. కంటెస్టెంట్లుగా ఎవరికి వారు సొంతంగా గేమ్‌ ఆడండి అని శివజ్యోతి.. వరుణ్‌, వితికలకు చురకలు అంటించింది. మూడో స్థానం నుంచి కదిలేది లేదని వితిక పక్కనే నుంచుని పేచీకి దిగింది.

సహనం కోల్పోయిన వరుణ్‌.. శివజ్యోతిపై ఫైర్‌ అయ్యాడు. కంత్రి ఆటలు ఆడకు అంటూ ఆమెను వెక్కిరించాడు. దీంతో వెటకారాలు, వెక్కిరింతలు చేయొద్దని శివజ్యోతి వరుణ్‌కు స్పష్టం చేసింది. చాలా సేపటివరకు ఇదే గొడవ కొనసాగింది. చివరకు బజర్‌ మోగడంతో టాస్క్‌ సమయం అయిపోయింది. ఎవరెవరూ ఏయే.. స్థానాల్లో ఉండాలో నిర్ణయించుకోడంలో గందరగోళం, సందిగ్దత ఏర్పడినందున.. ఈ వారం అందరూ నామినేషన్‌కు వెళ్తున్నారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

ఇక వరుణ్‌, వితిక, శివజ్యోతి మాటల యుద్ధంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. వితికను నామినేట్‌ చేయడానికే శివజ్యోతి ఈ కుట్ర పన్నిందని నెటిజన్లు అంటున్నారు. వరుణ్‌ ప్రవర్తనను కూడా ఓ వర్గం ఎండగడుతోంది. మొత్తంమీద ఈ ముగ్గురూ చేసిన తప్పుకు ఇంటి సభ్యులంతా నామినేట్‌ అవ్వాల్సి వచ్చింది. అయితే, ఈ గొడవ వల్ల నష్టపోయేది మాత్రం వితికే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ను వీడేది వితికే అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతవరకు నామినేషన్‌లోకి ఎక్కువగా రాని  వితిక, శివజ్యోతిలను ఈసారి ఇంటికి పంపిస్తామనే ఆలోచనలో జనం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈవారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందో చూడాలి..!

మరిన్ని వార్తలు