బిగ్‌బాస్‌: నా భర్తే నాకు స్ఫూర్తి, ప్రోత్సాహం

1 Nov, 2019 08:32 IST|Sakshi

పచ్చిపులుసుకు మరింత ప్రాచుర్యం తెచ్చాను

కేసీఆర్‌తో పోల్చడం ఎప్పటికీ మరిచిపోలేను 

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ శివజ్యోతి మనోగతం

తెలంగాణ భాష, యాసను వినిపించి బిగ్‌బాస్‌ సీజన్‌– 3 హౌజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి శివజ్యోతి టాప్‌– 5లో ఉంటానని ఆశించారు. ఓట్ల శాతం తగ్గడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత ఆదివారం హౌజ్‌ నుంచి బయటకు వచ్చారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఆమె తెలంగాణ యాసను నమ్ముకొని అక్కడి నుంచి ప్రయాణమై జూబ్లీహిల్స్‌ అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెట్టారు. అక్కడ మహామహులను ఢీకొట్టి 14 వారాలపాటు తెలంగాణ భాషతో అందరినీ ఆకట్టుకున్నారు. ఏకంగా బిగ్‌బాస్‌తోనే తెలంగాణ భాషను పలికించారు. బిగ్‌బాస్‌ వ్యాఖ్యాత నాగార్జునతో తెలంగాణ యాసలోనే మాట్లాడించిన ఘనత కూడా సొంతం చేసుకున్నారు. ఇది తన జీవితంలో మర్చిపోలేనిదని ఆమె వెల్లడించారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఆమె ప్రయాణం.. ఎలిమినేషన్‌ దాకా దారి తీసిన పరిస్థితులు భవిష్యత్‌ వ్యూహాలపై తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు.   – బంజారాహిల్స్‌ 

మావారే స్ఫూర్తి..  
మాది నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలోని నాగంపేట గ్రామం. ఇంటర్‌ వరకు చదివాను. నాన్న రాజమల్లేష్‌ ఆర్‌ఎంపీ. అమ్మ లావణ్య ఇప్పటికీ బీడీలు చుడుతుంది. నాకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. నా భర్త గంగూలీది కూడా మా ఊరే. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా భర్తే నాకు స్ఫూర్తి, ప్రోత్సాహం. 

ఎంతో గర్వంగా ఫీలయ్యేదాన్ని..  
నేను ఆరేళ్ల క్రితం తార్నాకలోని ఓ ప్రైవేట్‌ కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి గమనించారు. నీ భాష, యాస బాగున్నాయమ్మా ఫలానా చానెల్‌లో ఇలాంటి గొంతు కోసం చూస్తున్నారని చెప్పడంతో బంజారాహిల్స్‌లోని ఓ చానెల్‌లో చక్కని అవకాశం, గుర్తింపు వచ్చింది. నా భాషనే నన్ను అందలం ఎక్కించింది. ఆ యాసనే నన్ను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి తీసుకొచ్చింది. నాకు ఇంతకంటే ఏం కావాలి. పొల్లుపోకుండా ప్రతి మాటను నా భాషలో మాట్లాడుతుంటే అందరూ ఎంతో ఆసక్తితో వినేవారు. ఇది నాకు చాలా గర్వంగా ఉండేది. కేసీఆర్‌ మాట్లాడుతుంటే కూడా ఇలాగే వినాలనిపిస్తుందని ఓ కంటెస్టెంట్‌ చెప్పిన మాటలు నాకు మరింత స్ఫూర్తినిచ్చాయి.  

ఆ ఆనందం వర్ణనాతీతం
నేను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి జూలై 21న అడుగు పెట్టాను. అక్టోబర్‌ 26న హౌజ్‌ నుంచి బయటకు వచ్చాను. 98 రోజుల పాటు నా ఆనందం వర్ణనాతీతం. హౌజ్‌లో ఎవరితోనూ గొడవలు లేవు. కాకపోతే అలీ, రవికృష్ణ, హిమజ, రోహిణి, అశురెడ్డి తదితరులు నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక కూడా మేము మా స్నేహాన్ని ఇలాగే కొనసాగిస్తాం. మిగతావారితో కూడా క్లోజ్‌గానే ఉండేదాన్ని.   

క్వాలిటీస్‌ స్ట్రాంగయ్యాయి
ఈ 98 రోజుల జర్నీలో నా క్వాలిటీస్‌ మరింత స్ట్రాంగయ్యాయి. నేను చాలా మొండిదాన్ని. ఓపిక కూడా చాలా తక్కువ. ఆలోచించుకొని మాట్లాడటం నేర్చుకున్నాను. నేను సోది చెప్పకుండా మొహం మీదే మాట్లాడేస్తాను. బయట కూడా నేను ఇలాగే ఉంటాను. బిగ్‌బాస్‌ హౌజ్‌లో నుంచి గత ఆదివారమే బయటికి వచ్చాను. మూడు రోజలు పాటు నా బంధుమిత్రులతో కలుస్తున్నాను. మరో మూడు రోజుల్లో ఫైనల్‌ పోటీలున్నాయి. నేను కూడా హాజరు కావాల్సి ఉంది. ఫైనల్‌ తర్వాత నా భవిష్యత్‌ నిర్ణయం ఉంటుంది. రెండు టీవీ చానెళ్లు నన్ను ఆహ్వానిస్తున్నాయి. ఎందులోకి వెళ్తానో వారం రోజుల్లో తెలిసిపోతుంది.  

కలలో కూడా అనుకోలేదు..
భారీ అంచనాలతో నేను హౌజ్‌లోకి అడుగు పెట్టలేదు. నాతో పోటీ పడుతున్న వాళ్లను చూస్తే మొదట్లోనే చివరిదాకా ఉంటానా అని అనిపించింది. కానీ 14 వారాల జర్నీ నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక్కడిదాకా వస్తానని కలలో కూడా అనుకోలేదు. కాకపోతే టాప్‌– 5లో ఉండి ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నా.  

ఇక చాలు.. 
చాలా మంది వచ్చే సీజన్‌లో అవకాశం ఇస్తే వెళ్తారా అని నన్ను అడుగుతున్నారు. మళ్లీ అవకాశం వచ్చినా వెళ్లను. ఎందుకంటే బిగ్‌బాస్‌ హౌజ్‌లో నేను ప్రతి స్కిట్‌లోనూ, టాస్క్‌లోనూ పాల్గొన్నాను. ఆడాను.. పాడాను.. అందరితో ఆనందాన్ని, బాధను పంచుకున్నాను. 

పచ్చిపులుసు.. అదుర్స్‌   
నేను తెలంగాణ సంప్రదాయ వంటకం పచ్చిపులుసుతో అందరినీ ఆకట్టుకున్నాను. టమాటా రసం, సాంబారు చేసినా కంటెస్టెంట్లు మాత్రం ఎక్కువగా పచ్చి పులుసునే తినేవారు. నేను హౌజ్‌ నుంచి బయటికి వచ్చే రోజు కూడా పచ్చిపులుసుతోనే అందరికి వంటలు వండిపెట్టాను. నాకు కాకరకాయ కూర అంటే కూడా బాగా ఇష్టం. నేను వండిన ప్రతీ వంటకం అందరికీ నచ్చేది.  

మరిన్ని వార్తలు