బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!

30 Sep, 2019 12:49 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంటిసభ్యుల్లో కొంతమంది ఓ పట్టాన అర్థం కావట్లేదు. అందులో ముందు వరుసలో ఉండే వ్యక్తి బాబా భాస్కర్‌. ఇప్పటికే చాలాసార్లు బాబా ‘మాస్కర్‌’ అన్న నాగార్జున తాజా ఎపిసోడ్‌లోనూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘ఆడాలని లేదు, వెళ్లిపోతాను’ అంటూనే ఎవర్ని పంపించాలో బాబా ప్లాన్‌ చేశాడు. తీరా ప్లాన్‌ వీడియోను వీకెండ్‌లో నాగార్జున అందరిముందు చూపించడంతో బాబా గుట్టు రట్టయింది. ఇక నాగ్‌ ఇచ్చిన కౌంటర్లతో ఎంటర్‌టైన్‌మెంట్‌ బాబా కాస్త మూడీ బాబాగా మారిపోయాడు. ఇప్పటికే అతను టార్గెట్‌ చేసిన బిగ్‌బాడీల్లో ఒకరైన రవి ఎలిమినేట్‌ అయ్యాడు. మరో టార్గెట్‌ అయిన శ్రీముఖి కెప్టెన్‌ అవటంతో ఈవారం నామినేషన్‌లోకి వచ్చే ప్రసక్తే లేదు.  మరోవైపు విడిపోయిన నలుగురు మిత్రులను నాగ్‌ కలపాలని ప్రయత్నించగా రాహుల్‌, వరుణ్‌ తిరిగి మళ్లీ ఒక్కటయ్యారు. కానీ వితిక, పునర్నవి మధ్య అగ్గి చల్లారినట్టు కనిపించడం లేదు.

పదకొండోవారానికిగానూ నామినేషన్‌ ప్రక్రియను బిగ్‌బాస్‌ కాస్త వెరైటీగా ఇచ్చాడు. వారిమధ్య ఎలాంటి చిచ్చు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే గేమ్‌ ఆడించనున్నాడు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు ఎలాంటి సదుపాయాలు లేని సాదాసీదా జీవనాన్ని గడపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఇంటిపై హఠాత్తుగా రాళ్ల వర్షం పడుతుంది. ఆ సమయంలో ఇంటిసభ్యులు అప్రమత్తతతో రాళ్లను సేకరించి జమ చేస్కోవాలి. ఇక్కడో చిన్న ట్విస్ట్‌ దాగి ఉంది. బజర్‌ మోగిన ప్రతీసారి ఎవరి దగ్గరైతే ఎక్కువ రాళ్లు కాకుండా ఎక్కువ విలువైన రాళ్లు ఉంటాయో వారు నామినేషన్‌ నుంచి తప్పించుకోవచ్చు. అదే విధంగా తక్కువ విలువ ఉన్న రాళ్లను సేకరించినవారు నామినేట్‌ అవుతారు. జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవటం ఏమో కానీ ఈ పూటకు వీలైనన్ని ఎక్కువ రాళ్లు చేజిక్కించుకోవాలని ఆరాటం చెందుతున్నారు హౌస్‌మేట్స్‌. ఇప్పటివరకు టాస్క్‌లో పెద్దగా చురుకుగా పాల్గొనని పునర్నవి నామినేషన్‌ నుంచి గట్టెక్కడానికి కష్టపడుతుందా అనేది చూడాలి. మరి ఈ వారం రాళ్లు వెనుకేసుకోకుండా నామినేషన్‌ జోన్‌లోకి ఎవరు వెళ్తారనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది!

మరిన్ని వార్తలు