కారు కన్నా ముందే కొనేశా: రాహుల్‌ సిప్లిగంజ్‌

7 Jan, 2020 13:04 IST|Sakshi

బిగ్‌బాస్‌లో అడుగుపెట్టినవాళ్లకు ఉన్న కాస్త గుర్తింపు కూడా పోతుందనేది ఎప్పటినుంచో వినిపిస్తున్న వాదన. కానీ బిగ్‌బాస్‌ 3 తెలుగులో మాత్రం ఇది రుజువు కాలేదు. దీనికి భిన్నంగా బిగ్‌బాస్‌ 3 చాలామందికి కలిసొచ్చింది. ఈ షోతో పలువురు పార్టిసిపెంట్లు సెలబ్రిటీలుగా మారిపోయారు. అందులో మొదటి వ్యక్తి విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌. అతని గురించి చెప్పాలంటే బిగ్‌బాస్‌ ముందు, బిగ్‌బాస్‌ తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో. అంతలా అతని క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. గతంలో ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో గుర్తింపుకు ఆరాటపడ్డ రాహుల్‌ బిగ్‌బాస్‌ అందించిన స్టార్‌డమ్‌తో సింగర్‌గానూ నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పటికే రాహుల్‌ ఆలపించిన పలు సాంగ్స్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఏదైతేనేం 2019 రాహుల్‌కు బాగానే కలిసొచ్చింది.

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి బద్ధ శత్రువుల్లా అస్తమానం గొడవపడుతుండేవారు. కానీ రాహుల్‌ విజయాన్ని అందుకోడానికి ఇది కూడా ఒకింత ప్లస్‌ అయిందనేవారు లేకపోలేరు. అయితే బిగ్‌బాస్‌ ముగిసిన తర్వాత తాను కాల్‌ చేస్తే కనీసం ఫోన్‌ కూడా ఎత్తలేదని వాపోయిన రాహుల్‌ తర్వాతి కాలంలో శ్రీముఖితో బాగానే కలిసిపోయాడు. ఇక నుంచి కొత్త రిలేషన్‌షిప్‌ స్టార్ట్‌ అవుతుందంటూ వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోను పంచుకోగా అప్పట్లో ఇది వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. స్నేహం కన్నా ఎక్కువ అని చెప్పుకున్న పునర్నవిని బిగ్‌బాస్‌ తర్వాత కూడా వదిలిపెట్టలేదు. తనను గెలిపించిన అభిమానుల కోసం ఫ్రీ లైవ్‌ కన్సర్ట్‌ ఏర్పాటు చేయగా అందులో పునర్నవి సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన విషయం గుర్తుండే ఉంటుంది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో కానీ, పలు ఇంటర్వ్యూల్లో కానీ రాహుల్‌ ఎప్పుడూ ఓకే ఒక కోరికను చెప్తుండేవాడు. తన కుటుంబం ఇప్పటికీ అద్దె ఇంట్లో ఉంటుందని ఎప్పటికైనా ఓ కొత్తిల్లు కొనుక్కోవాలన్నదే తన డ్రీమ్‌గా చెప్పుకొచ్చేవాడు. దానితోపాటు అధునాతన బార్బర్‌ షాప్‌ పెట్టుకోవాలన్నది కూడా తన కలగా పేర్కొన్నాడు. అయితే రాహుల్‌ ఈ మధ్య బెంజికారు కొన్నాడు. సెలబ్రిటీ హోదా రాగానే కలలు మారిపోయినట్టున్నాయని కొందరు అతన్ని విమర్శించారు. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ కారు కన్నా ముందే ఫ్లాట్‌ కొనేశానని వెల్లడించాడు. అది పూర్తిగా సిద్ధమవడానికి ఇంకో ఏడు నెలలు పడుతుందని సమాధానమిచ్చాడు. దీంతో చిచ్చా(రాహుల్‌) సొంతింటి కల నెరవేరనుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: సవారికి సిద్ధం 

పునర్నవితో కలిసి రాహుల్‌ డ్యాన్స్‌ 

మరిన్ని వార్తలు