అర్మాన్ కోహ్లీ అరెస్టు.. బెయిలు

17 Dec, 2013 13:33 IST|Sakshi
అర్మాన్ కోహ్లీ అరెస్టు.. బెయిలు

బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటిష్-పాకిస్థానీ నటి సోఫియా హయత్ ఫిర్యాదు మేరకు లోనావాలా పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో అతడిని బిగ్ బాస్ హౌస్లోంచి తీసుకెళ్లారు. తనను బూతులు తిట్టి, కొట్టాడంటూ అర్మాన్ కోహ్లీపై సోఫియా హయత్ ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాళ్లు దర్యాప్తు నిమిత్తం లోనావాలా పోలీసులకు బదిలీ చేయగా, అక్కడి పోలీసులు.. కేసును దర్యాప్తు చేసి, కోహ్లీని అరెస్టు చేశారు. అనంతరం అర్మాన్ కోహ్లీకి బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.

సోఫియా హయత్ ఫిర్యాదుతో అర్మాన్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు శాంతాక్రజ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అరుణ్ చవాన్ తెలిపారు. కోహ్లీపై ఐపీసీ సెక్షన్లు 324, 504, 509, 506, 354ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక వేధింపుల దగ్గర్నుంచి ప్రమాదకర ఆయుధాలతో గాయపర్చడం లాంటి నేరాలున్నాయి. పోలీసులు చాలా బాగా స్పందించారని, మర్యాదగా వ్యవహరించారని అన్నారు. అంతకుముందు బిగ్బాస్లోని తనీషా, అజాజ్ ఖాన్ తదితరులతో కూడా సోఫియాకు గొడవలయ్యాయి. అర్మాన్ కోహ్లీతో గొడవే హింసాత్మకంగా మారింది.