కేసు నమోదు : చిక్కుల్లో బిగ్‌బాస్‌ 2!

2 Aug, 2018 15:21 IST|Sakshi

చెన్నై : రాజకీయ ప్రత్యర్ధి ఎవరన్నది నిర్ణయించుకునే సమయం అసన్నమైందని ఇటీవల వ్యాఖ్యానించిన మక్కళ్‌ నీది మయం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్‌ హాసన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్‌-2 రియాల్టీ షోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కమల్‌ హాసన్‌, బిగ్‌బాస్‌ 2 నిర్వాహకులతో పాటు షోను ప్రసారం చేస్తున్న విజయ్‌ టీవీలపై చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. ఉద్దేశపూర్వకంగానే కమల్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవల ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో వీక్లీ టాస్క్‌ జరిగింది. ఆ ఎసిసోడ్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌ కంటెస్టెంట్‌ ఒకరు నియంతగా వ్యవహరించాల్సి వచ్చింది. తర్వాతి ఎపిసోడ్‌లో హోస్ట్‌ కమల్‌ ఆ టాస్క్‌ గురించి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తే నేతలకు ఎలాంటి గతి పడుతుందో అందరూ చూశారని పేర్కొన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలితను నియంతగా చూపించే యత్నం జరిగిందని ఆరోపిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని లూయిసాల్‌ రమేష్‌ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియాల్టీ షో అయినందున కమల్‌ హాసన్‌, బిగ్‌బాస్‌ 2 తమిళ్‌ నిర్వాహకులు, షో ప్రసారం చేస్తున్న విజయ్‌ టీవీ ఛానల్‌లపై చర్యలు తీసుకోవాలని రమేష్‌ తన ఫిర్యాదులో కోరారు.

కాగా, ఇలాంటి రియాల్టీ షోలు తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు సామాజికవేత్తలు ఇటీవల విజయ్‌ టీవీ ఛానల్‌ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. తమిళ ఆచారాలను మంటగలుపుతున్నారని విమర్శిస్తూ.. బిగ్‌బాస్‌ తమిళ రియాల్టీ షోపై నిషేధం విధించాలని హిందూ మక్కల్‌ కట్చి (హెచ్‌ఎంకే) పార్టీ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షో మరో కొత్త వివాదంలో చిక్కుకుంది.

మరిన్ని వార్తలు