ఆ కష్టాలు సినిమా వాళ్లకే తెలుసు

12 Mar, 2019 02:53 IST|Sakshi
శ్రీనాథ్, డి.కె. అరుణ, శాన్వీ, నాగసాయి, శ్రీనివాస్, గోరటి వెంకన్న

 – డి.కె. అరుణ

‘‘మా శ్రీనివాస్‌ వ్యాపార రంగంలో ఉన్నారు. సినిమాలకు కొత్త అయినప్పటికీ మంచి చిత్రాన్ని రూపొందించారు. మనకు పైకి  కనిపించే సినిమా రంగులమయంగా ఉంటుంది. కానీ, దానిలో కష్టాలు సినిమా చేసే వాళ్లకే తెలుస్తాయి. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’ చిత్రంలో మా పాలమూరు జిల్లాకు చెందిన వాళ్లే ఉండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయవంతం కావాలి’’ అని మాజీ మంత్రి డి.కె. అరుణ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’.

ఎంఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలవుతోంది. సాబూ వర్గీస్‌ సంగీతం అందించిన పాటలను డి.కె. అరుణ విడుదల చేశారు. ‘‘చిన్నప్పటి నుంచి నాకు కళలపై ఆసక్తి. కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో దర్శకుణ్ణి అవుదామని కృష్ణానగర్‌ వచ్చాను. చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ల కష్టాలు చూసి ఇక్కడ మనం ఉండలేం అని తిరిగి వెళ్లిపోయాను. వ్యాపారంలో స్థిరపడ్డాను. ఆనాటి నా ఆకాంక్షని ఈరోజు నిర్మాతగా మారి సినిమా చేశాను’’ అన్నారు మహంకాళీ శ్రీనివాస్‌.

‘‘నాకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి పెద్దగా ఉండదు. మహంకాళీ శ్రీనివాస్‌ విలువలు తెలిసిన వ్యక్తి. అందుకే ఈ చిత్రంలో నటించాను’’ అని పాటల రచయిత గోరటి వెంకన్న అన్నారు. ‘‘ఆద్యంతం సహజంగా సాగే కథాకథనాలతో మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సందేశాత్మకంగా ఉన్నా వాణిజ్య అంశాలకు0 ఎక్కడా లోటుండదు’’ అన్నారు నాగసాయి మాకం. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘన, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, పాటల రచయిత మౌన శ్రీ మల్లిక్, సినిమాటోగ్రాఫర్‌ తోట వి. రమణ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు