మా కష్టమంతా మర్చిపోయాం

19 Mar, 2019 00:51 IST|Sakshi
మాగంటి శ్రీనాథ్, శాన్వీ, నాగసాయి

– నాగసాయి మాకం

‘‘ఆంధ్రా ప్రజలకు పెరుగన్నం, ఆవకాయతో తినడం ఇష్టం. తెలంగాణ వాళ్లకు ధమ్‌ బిర్యానీ తింటే సంతృప్తి. ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌’ చూస్తే అలాంటి సంతోషమే ప్రేక్షకులకు దక్కుతుంది’’ అని మహంకాళి శ్రీనివాస్‌ అన్నారు. మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిలాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌’. మహంకాళి శ్రీనివాస్‌ నిర్మాత. కవి గోరటి వెంకన్న కీలక పాత్ర పోషించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోందని చిత్రబృందం పేర్కొంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో మహంకాళి శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. తొలి చిత్రానికే విజయం దక్కడం నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చింది’’ అన్నారు. ‘‘ఫస్ట్‌ షో చూస్తుంటే సినిమాకు పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. సినిమా బావుంటే నటీనటులు కొత్తా పాతా అని ఉండదని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’’ అన్నారు నాగసాయి. ‘‘ఎలాంటి అశ్లీలత, హింస మా చిత్రంలో లేదు. నేను రాసిన పాటలను అందరూ ఆనందించారు. తాజాగా నేను నటించిన ఈ చిత్రాన్ని కూడా ఆనందిస్తున్నారు’’ అని గోరటి వెంకన్న అన్నారు. ఈ వేడుకలో శ్రీనాథ్, శాన్వీ, సంగీత దర్శకుడు సాబూ వర్గీస్, మౌన శ్రీ మల్లిక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు