తెలుగు హీరోయిన్ పెద్ద మనసు

29 Aug, 2015 09:45 IST|Sakshi

తెలుగమ్మాయే అయినా సొంతం గడ్డ మీద సక్సెస్ కాలేక కోలీవుడ్ బాట పట్టిన హీరోయిన్ బిందుమాధవి.. తెలుగులో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసిన ఈ హీరోయిన్ ...తమిళ నాట మాత్రం వరుస అవకాశలతో దూసుకుపోతుంది.. అయితే అక్కడ కూడా పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోవటంతో బడ్జెట్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది ఈ భామ..

ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన పెద్ద మనసుతో ఇండస్ట్రీ వర్గాలను తన వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయ్యింది. ఇటీవల కోలీవుడ్లో బిందుమాధవి నటించిన ఓ సినిమా.., రిలీజ్ విషయంలో ఇబ్బందుల్లో పడింది. ఒకప్పటి యాక్షన్ హీరో అరుణ్ పాండ్యన్ నిర్మించిన ఈ చిన్న సినిమా అనుకున్నా... బడ్జెట్ను మించి పోవటంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

తాను హీరోయిన్గా నటించిన సినిమా విడుదల ఆగిపోవటంతో బిందుమాధవి రెమ్యూనరేషన్లో కొంత భాగం తిరిగి ఇవ్వటానికి రెడీ అయ్యింది. తన వంతుగా రూ.5 లక్షలు రిటర్న్ చేయటంతో మిగిలిన యూనిట్ సభ్యులు కూడా బిందు బాటలో నడవటానికి సిద్ధం అవుతున్నారు. కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లు కూడా నిర్మాత కష్టాలు పట్టించుకోని సమయంలో బిందుమాధవి చేస్తున్న సాయం కోలీవుడ్ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.