ఒక పుస్తకమే.. ఆయన విడాకులకు కారణం

7 Jan, 2017 16:32 IST|Sakshi
ఒక పుస్తకమే.. ఆయన విడాకులకు కారణం
టాలెంట్ ఉన్నవారి వెనుక వివాదాలు కూడా ఉంటాయి. అందులోనూ సెలబ్రిటీల విషయంలో అయితే వాటికి కొదవే లేదు. ప్రముఖ జర్నలిస్టు అయిన తన భార్య నందితా పురి నుంచి ఓంపురి విడిపోవడం కొన్నేళ్ల క్రితం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. ఓంపురి జీవిత చరిత్రను 'అన్‌లైక్‌లీ హీరో: ఓంపురి' పేరుతో నందిత రాశారు. 14 ఏళ్ల వయసులోనే ఓంపురి నెరపిన శృంగారలీలల గురించి అందులో రాశారు. ఈ పుస్తకం 2009లో బయటకు వచ్చింది. అయితే, పుస్తకంలో ఆమె రాసిన విషయాలకు తాను తన ఆమోదం తెలపలేదని ఓంపురి అన్నారు. తన కేర్‌టేకర్‌గా ఉండే మహిళతో 14 ఏళ్ల వయసులో ఓంపురి తొలిసారి శృంగార అనుభవాన్ని పొందారని ఆ పుస్తకంలో నందిత రాశారు. లక్ష్మి అనే మహిళతో కూడా ఆయనకు చాలా కాలం సంబంధం ఉండేదని అందులో పేర్కొన్నారు. 
 
అయితే లక్ష్మి గురించి నందిత చాలా అసహ్యంగా రాశారని, ఆమె తన పిల్లలను, తన సోదరుడి అనాథ పిల్లలను పెంచారని ఆ తర్వాత ఓంపురి చెప్పారు. ఆమె తన పట్ల ఎంతో విశ్వాసంతో ఉండేవారని కూడా తెలిపారు. ఈ పుస్తకం కారణంగానే ఓంపురి-నందిత విడిపోయారని ఇద్దరికీ సన్నిహితంగా ఉండే కొందరు చెప్పారు. పుస్తకం ప్రింటింగ్‌కు వెళ్లడానికి ముందు స్క్రిప్టు తనకు చూపించమంటే నందిత చూపించలేదన్నది అప్పట్లో ఓంపురి వాదన. 
 
ఓంపురి తొలుత అన్నూకపూర్ సోదరి సీమా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ, 1991లో వాళ్లు పెళ్లయిన 8 నెలల తర్వాతే విడిపోయారు. 1993లో నందితను పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికీ ఇషాన్ అనే కొడుకు ఉన్నాడు. నిజాయితీగా ఉండటాన్ని ఓంపురి ఇష్టపడతాడు గానీ, చాలాసార్లు అది ఎంచుకున్న నిజాయితీయే అవుతుందని నందిత ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం ఓంపై నందిత గృహహింస కేసు పెట్టారు. ఆ తర్వాత 2003లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఓంపురి అంత్యక్రియలను ఆయన కొడుకు ఇషాన్ నిర్వహించాడు. మాజీ భార్య అయిన నందిత కూడా ఆ అంత్యక్రియలకు హాజరయ్యారు.