ఆ ముగ్గురి మధ్య నిశ్శబ్ద యుద్ధం?

26 May, 2014 23:50 IST|Sakshi
ఆ ముగ్గురి మధ్య నిశ్శబ్ద యుద్ధం?

 ఇద్దరు కథానాయికలతో సినిమా తీస్తే, ఇద్దరి పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉండేలా చూడటంతో పాటు, షూటింగ్ లొకేషన్లో కల్పించే సౌకర్యాల విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపొతే వారు అలుగుతారు. ఆ అలక వల్ల షూటింగ్ అటకెక్కే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీలైనంతవరకూ ఇద్దరు ముద్దుగుమ్మల మనసు నొప్పించకుండా జాగ్రత్త వహిస్తారు. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్‌కి ఈ విషయం తెలిసే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ తమన్నాకి ప్రాధాన్యం ఇచ్చి, బిపాసా బసు, ఇషా గుప్తాలను తక్కువ చేశారట.
 
 ఈ ముగ్గురూ కథానాయికలుగా సైఫ్ అలీఖాన్, రితేష్ దేశ్‌ముఖ్, రామ్‌కపూర్ కథానాయకులుగా ఆయన దర్శకత్వం వహించిన ‘హమ్ షకల్స్’ వచ్చే నెల 20న విడుదల కానుంది. సాజిద్ దర్శకత్వంలో రూపొందిన ‘హిమ్మత్‌వాలా’లో తమన్నా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచే సాజిద్, తమన్నాల మధ్య మంచి స్నేహం కుదిరిందనే వార్త ప్రచారం అయ్యింది. కొంతమంది అది స్నేహం కాదు.. ప్రేమ అని కూడా అంటున్నారు.  కానీ, ‘తమన్నా నా చెల్లెలు లాంటిది’ అని ఆ మధ్య సాజిద్ ఓ ప్రకటన చేశారు. అయినప్పటికీ ఈ తమన్నాతో ఆయన ప్రవర్తిస్తున్న తీరు సందేహాలకు తావిస్తోందని హిందీ సినీవర్గాలు అంటున్నాయి. దానికి తగ్గట్టు ‘హమ్ షకల్స్’ షూటింగ్ సమయంలో తమన్నాకి ఇచ్చినంత ప్రాధాన్యం బిపాసాకూ, ఇషాకూ ఇవ్వలేదనే వార్త బయటకు వచ్చింది. చివరికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లోనూ తమన్నాదే హవా అట.
 
  దాంతో బిపాసా, ఇషాల మనసులు గాయపడ్డాయని సమాచారం. తమన్నాను నెత్తి మీద పెట్టుకుంటున్నాడని, తమను లెక్క చేయడం లేదని సన్నిహితుల దగ్గర వాపోయారట. సాజిద్ మీదే కాదు.. తమన్నా మీదా కోపం పెంచుకున్నారట. మొత్తం మీద ఈ ముగ్గురి నాయికల మధ్య నిశ్శబ్ద యుద్ధం జరుగుతోందని టాక్. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది కాబట్టి ఫర్వాలేదు.. లేకపోతే సాజిద్‌కి ఈ ఇద్దరూ చుక్కలు చూపించేవారని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు మరో 25 రోజులే ఉంది. ఈలోపు చిత్ర ప్రచార కార్యక్రమాలకు బిపాసా, ఇషా దూరంగా ఉంటారనే ఊహాగానాలూ ఉన్నాయి. ఏమవుతుందో మరి.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి