అవిభక్త కవలలుగా బిపాసా

13 Jun, 2014 00:50 IST|Sakshi
అవిభక్త కవలలుగా బిపాసా

 ఏ ఆర్టిస్ట్‌కైనా మంచి పాత్ర చేసే అవకాశం వస్తే, అందులో ఒదిగిపోవడానికి శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడటానికైనా వెనుకాడరు. ప్రస్తుతం బిపాసా బసు  ఆ పని మీదే ఉన్నారు. తన పదమూడేళ్ల కెరీర్‌లో చేయనటువంటి విభిన్నమైన పాత్రను ఆమె చేయనున్నారు. ఈ పాత్ర ద్వారా నటిగా తన దాహం కొంత మేరకు తీరుతుందని సన్నిహితులతో చెబుతున్నారట బిపాసా. ఆ పాత్ర విషయానికొస్తే.. థాయ్ చిత్రం ‘ఎలోన్’ ఆధారంగా హిందీలో ఓ చిత్రం రూపొందనుంది. అవిభక్త కవలల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో కవలల పాత్రను బిపాసా చేయనున్నారు. దీని గురించి ఆమె చెబుతూ - ‘‘సవాళ్లను ఎదుర్కోవడం నాకిష్టం. అందుకే ఈ సినిమా అంగీకరించాను.
 
 శారీరకంగా ఒకే విధంగా ఉండే కవలలు, మానసికంగా విభిన్నంగా ఉంటారు. అతుక్కుని పుట్టినా, మనస్తత్వాలు వేరు. ఈ రెండు కోణాలకు వ్యత్యాసం కనబర్చడానికి శాయశక్తులా కృషి చేస్తాను. అవిభక్త కవలల గురించి పత్రికల్లో చదివాను. టీవీల్లోనూ చూశాను. కానీ, వారి తీరుతెన్నులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూడలేదు. అందుకే, వారికి సంబంధించిన కొన్ని లఘు చిత్రాలు చూస్తున్నా. ఈ నెల 20న షూటింగ్ ఆరంభం కానుంది. కచ్చితంగా నా కెరీర్‌లో ఎప్పటికీ చెప్పుకునే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ‘ఎలోన్’ చిత్రం ఆధారంగా దక్షిణాదిన రూపొందిన ‘చారులత’లో ప్రియమణి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా ప్రియమణికి మంచి పేరొచ్చింది. మరి బిపాసాకి ఎలాంటి అనుభూతి మిగులుతుందో.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి