తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతోంది... - కేట్ విన్‌స్లెట్

6 Nov, 2015 00:29 IST|Sakshi
తలుచుకుంటేనే రక్తం ఉడికిపోతోంది... - కేట్ విన్‌స్లెట్

వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్... ఇవి లేకుండా ఇప్పుడు ప్రపంచాన్ని ఊహించలేం. అంతలా మానవ జీవితాల్లోకి చొరబడిపోయిన సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో, అన్ని సైడ్ ఎఫెక్టులు కూడా గ్యారెంటీ. ఈ ఎఫెక్టులే తల్లిదండ్రుల పాలిట శాపంగా తయారయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ సామాజిక మాధ్యమాల దుష్ర్పభావం తమ పిల్లల మీద పడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. హాలీవుడ్ తార కేట్ విన్‌స్లెట్ అయితే ఏకంగా ఇంట్లో నెట్‌ను నిషేధించారు. ఫోన్ కూడా అవసరం ఉన్నప్పుడే వాడాలని పిల్లలకు నిబంధన విధించారు.

‘‘సోషల్ మీడియా గురించి తలుచుకుంటే రక్తం ఉడికిపోతోంది. చాలా మంది సెల్ఫీలు, తాము దిగిన ఫొటోలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేసుకుంటారు. ఎదుటివాళ్ల కామెంట్స్ గురించి ఎదురుచూస్తూ, వాళ్లకు నచ్చేలా తమను తాము మలుచుకుంటారే గానీ తమకు నచ్చినట్టుగా మారరు. తినడం, తాగడం అన్నీ మర్చిపోయి సోషల్ మీడియాకి బానిసలవుతున్నారు. నా పిల్లల బాల్యాన్ని ఇలాంటి టెక్నాలజీతో చిదిమేయడం నాకు ఇష్టం లేదు. కష్టమైనా తప్పదు’’ అని చెప్పుకొచ్చారు.