బోట్‌ డ్యాన్సర్‌.. కొరియోగ్రాఫర్‌..

10 Mar, 2020 08:41 IST|Sakshi

బౌద్ధనగర్‌: లక్ష్యాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడంతోపాటు ఓర్పు, నేర్పు, కష్టపడేతత్వం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రుజువు చేస్తున్నాడు సికింద్రాబాద్‌ వారాసిగూడకు చెందిన వర్ధమాన కొరియోగ్రాఫర్‌ విజయ్‌. బోట్‌ డ్యాన్సర్‌గా రూ.50 రోజువారీ వేతనంతో జీవితాన్ని ప్రారంభించి నేడు సొంతంగా డ్యాన్స్‌ స్టూడియోను ఏర్పాటు చేసుకుని ఆసక్తిగల చిన్నారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాడు. రోల్‌రిడా ఆల్బమ్స్‌కు నృత్యాలు అందించడంతోపాటు డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్, క్యాస్టూమ్స్‌ డిజైనర్‌గా ఇలా విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు విజయ్‌.   

బోట్‌ డ్యాన్సర్‌గా ప్రస్థానం మొదలు..  
నిరుపేద కుటుంబానికి చెందిన విజయ్‌కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లంటే ఆసక్తి. లుంబినీ పార్కులో బోట్‌ డ్యాన్సర్‌గా చేరాడు. రోజుకు కేవలం రూ.50 వేతనం ఇచ్చేవారు. బోట్‌ డ్యాన్సర్‌గా కొనసాగుతూనే సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడు. 

వీ9 డ్యాన్స్‌ స్టూడియో ఏర్పాటు  
సోదరుడు సంతోష్‌కుమార్‌ సాయంతో వారాసిగూడలో సొంతంగా వీ9 డ్యాన్స్‌ స్టూడియోను స్థాపించాడు. హిప్‌హప్, కాంటెంపరరీ, సెమిక్లాసికల్, లిరికల్‌ హిప్‌హప్‌ తదితర డ్యాన్స్‌ల్లో శిక్షణ ఇస్తున్నాడు. స్టూడియో సక్సెస్‌ కావడంతో మణికొండ, హబ్సిగూడల్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి వేలాదిమందికి శిక్షణ ఇస్తున్నాడు.

సినిమా ఇండ్రస్టీ నుంచి పిలుపు..
సినిమా ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో 2012లో సినిమాల్లోకి ప్రవేశించిన విజయ్‌ డ్యాన్సర్‌గా సుమారు 150 సినిమాల్లో నటించాడు. మిర్చి, కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాల్లో ప్రభాస్, పవన్‌కళ్యాణ్‌ సరసన స్టెప్పులేశాడు. అనంతరం కొరియోగ్రాఫర్‌గా అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. చచ్చిందిగొర్రె, తమిళతంబి వంటి సినిమాలతోపాటు రోల్‌రిడా ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా తన పనితనానికి పదునుపెట్టాడు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసుకున్నాడు. చిన్నారులతో డ్యాన్స్‌ పోటీలు నిర్వహించి ‘ఢీ’ తరహా ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు