సూది కనుల చెలియా!

3 May, 2020 08:10 IST|Sakshi

అప్పుడెప్పుడో అక్షయ్‌కుమార్‌  ‘సంఘర్ష్‌’ (1999)లో యంగర్‌ రితూ ఓబెరాయ్‌గా మెరిసిన ఆలియా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో కథానాయికగా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ‘హైవే’, ‘2 స్టేట్స్‌’,›‘డీయర్‌ జిందగీ’, ‘రాజీ’, ‘కలంక్‌’, ‘గల్లీ బాయ్‌’....సినిమాలతో తానేమిటో నిరూపించుకుంది అల్లరి పిల్ల ఆలియాభట్‌. శాస్త్రీయ నృత్యాలతోనూ ‘శబ్భాష్‌’ అనిపించుకుంది.  ‘రైట్‌ స్క్రిప్ట్‌’లను ఎంచుకోవడంలో నేర్పరి అనిపించుకున్న ఆలియా ముచ్చట్లు ఆమె మాటల్లోనే... (టాప్‌లో 3 ఇడియట్స్‌!)

అంత వీజీ ఏమీ కాదు...
మూసకు భిన్నమైన కొత్త పాత్రలను చేయడం అంత వీజీ ఏమీ కాదు. ఆ కష్టమేమిటో అనుభవపూర్వకంగా తెలిసిరావల్సిందే. ‘కలంక్‌’ సినిమాలో ‘రూప్‌ చౌధురి’  పాత్ర చేయడం నాకు ఒక కొత్త పాఠం. నిజానికి ఈ పాత్ర నాకు ఒక సవాలుగా నిలిచింది. రీల్‌ జీవితంలో ‘రూప్‌’కు, నిజజీవితంలో నాకు పోలికల విషయానికి వస్తే... రూప్‌ కాలం కంటే ముందుండే అమ్మాయి, నేను కాలంతో పాటు నడుస్తాను. రూప్‌ ‘దృఢమైన వ్యక్తిత్వం’, ‘ధైర్యం’ మూర్తీభవించిన అమ్మాయి. ఈ రెండు లక్షణాలు నాలో కూడా ఉన్నాయని నమ్ముతాను. ‘వారు ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారో’ అని మల్లగుల్లాలు పడకుండా ఆత్మసాక్షినే నమ్ముతుంది రూప్‌. ఆ విషయంలో నేను కనెక్ట్‌ అవుతాను. (నా జీవితంలోకి ప్రేమను తెచ్చారు: అలియా భావోద్వేగం)

అబ్బే అంత లేదు!
‘కలంక్‌’లో నేను నృత్యం చేసిన ‘ఘర్‌ మోరె పర్‌దేశియా’ పాటకు మంచి ప్రశంసలు వచ్చాయి. కొందరైతే ‘మాధురి దీక్షిత్‌లా చేశావు’ అన్నారు. కాని ఆమెలా ఎవరూ డ్యాన్స్‌ చేయలేరనేది నా అభిప్రాయం. నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని కాదు. ‘ఎంజాయ్‌’ డ్యాన్సర్‌ని. అందుకే తేజశ్రీ అనే డ్యాన్సర్‌ దగ్గర సంవత్సరం పాటు కథక్‌లో శిక్షణ తీసుకున్నాను. ఏమాత్రం ఖాళీ దొరికినా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేదాన్ని. నా ఫ్రెండ్స్‌ అయితే ‘నీకు డ్యాన్స్‌ పిచ్చి బాగానే పట్టినట్లుందే’ అని ఆట పట్టించేవాళ్లు! డ్యాన్స్‌ విషయంలో బిర్జూ మహారాజ్‌జీ విలువైన సలహాలు ఇచ్చారు. ‘అరే, ఇలా కూడా చేయవచ్చా!’ అని ఆశ్చర్యపోయాను.

తేడా ఏమీ లేదు...
ఒక సినిమాలో ఒక పాత్ర చేస్తున్నప్పుడు కెమెరా ముందు ఉన్నప్పుడే అందులో మమేకమైపోతాను. అదేపనిగా ఆ పాత్ర మైకంలోనే ఉండిపోతే వేరే సినిమాలో చేస్తున్నప్పుడు సమస్యలు రావచ్చు. ఒక పాత్ర ప్రభావం మరో దానిపై పడే అవకాశం ఉంది. ‘ఏ సినిమాకు ఆ సినిమా–ఏ పాత్రకు ఆ పాత్ర’ అన్నట్టుగానే ఉంటాను. అందుకే నేను స్విచ్‌ ఆన్‌–స్విచ్‌ ఆఫ్‌ యాక్టర్‌ని. మేఘనా గుల్జార్, జోయా అఖ్తర్‌లాంటి ఫిమేల్‌ డైరెక్టర్లతో పని చేయడం వినూత్నమైన అనుభవం. ‘మేల్‌ డైరెక్టర్లకు, ఫిమేల్‌ డైరెక్టర్లకు మధ్య ఉన్న తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు నా జవాబు ఏమిటంటే బొత్తిగా ఏమీ లేదనే! డైరెక్టర్‌ అంటే డైరెక్టరే!! 

మరిన్ని వార్తలు