భర్త క్షేమం కోరి...

18 Oct, 2019 00:28 IST|Sakshi
శిల్పా శెట్టి, సోనాక్షీ సిన్హా, రవీనా టాండన్‌

కర్వా చౌత్‌... ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్‌ నాడు భర్త ఆయురారో గ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. హిందీ పరిశ్రమలో ప్రతి ఏడాదీ ఉపవాసం ఆచరించి, పూజలు చేసే తారలు చాలామందే ఉన్నారు. గురువారం కర్వా చౌత్‌ సందర్భంగా కొందరు తారలు ఉపవాసం ఉన్నారు. తన భార్య జయా బచ్చన్‌ ఉపవాసం ఉన్న విషయాన్ని అమితాబ్‌ ట్వీటర్‌ ద్వారా పేర్కొన్నారు. గతంలో తామిద్దరూ దిగిన ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో తాను కనిపించకుండా జయబాధురి కనిపించేట్లు ఫొటో పెట్టి, ‘బెటర్‌ హాఫ్‌. మిగతా సగం ఇక్కడ అనవసరం.

అందుకే కనిపించడంలేదు’’ అని సరదాగా అన్నారు. అనిల్‌ కపూర్‌ తాను పరిగెడుతున్న ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, ‘‘ఇన్నేళ్లుగా నువ్వు (భార్య సునీతను ఉద్దేశించి) చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలు, ఆచరిస్తున్న ఉపవాసాలే నన్ను వేగంగా పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రతిరోజూ నేను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. హ్యాపీ కర్వా చౌత్‌’’ అని పేర్కొన్నారు. ‘‘ఉపవాసం కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. కొందరు కనిపించని, ఎప్పటికీ కలవని దేవుళ్ల కోసం ఉపవాసం ఉంటారు. కానీ నేను బతికి ఉన్నవాళ్ల కోసం చేస్తుంటాను.

నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా తల్లిదండ్రులు, నా భర్త, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు రవీనా టాండన్‌. ఫిట్‌నెస్‌కి బాగా ప్రాధాన్యం ఇచ్చే శిల్పా శెట్టి.. ఉపవాసం ఉంటున్న వాళ్ల కోసం ‘లౌకీ కీ ఖీర్‌’ అనే పోషకాలు ఉన్న స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చెప్పారు. సొరకాయతో ఈ ఖీర్‌ తయారు చేస్తారు. ప్రతి ఏడాదీ కర్వా చౌత్‌ని బాగా చేసుకుంటారు శిల్పా శెట్టి. ఈ ఏడాది కూడా ఫాస్టింగ్‌ ఉన్నారు. బార్సిలోనాలో శ్రియ పండగ చేసుకున్నారు. గత ఏడాది మార్చిలో రష్యాకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రీ కొషీవ్‌ని ఆమె పెళ్లాడారు.

‘‘అందరికీ కర్వా చౌత్‌ శుభాకాంక్షలు. మా అమ్మగారిని మిస్‌ అవుతున్నాను. అయితే పండగ సందర్భంగా తను పంపించిన ‘గోటా పట్టి’ చీర కట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రియ. ఇంకా షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ కూడా భర్త కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా గురువారం తారల డిజైనర్‌ శారీస్, నగలతో ఉత్తరాదిన కర్వా చౌత్‌ సందడి కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే...పండగ సందర్భంగా ‘దబాంగ్‌ 3’లో సోనాక్షీ సిన్హా లుక్‌ని విడుదల చేశారు. మామూలుగా కర్వా చౌత్‌ రోజున జల్లెడ లోంచి చంద్రుడ్ని చూస్తారు. ఈ లుక్‌ కూడా అలానే ఉంది. సో.. సినిమాలో భర్త సల్మాన్‌ ఖాన్‌ కోసం సోనాక్షీ కర్వా చౌత్‌ ఆచరించే సీన్‌ ఉంటుందన్న మాట.


జయా బచ్చన్‌


ఆండ్రీ, శ్రియ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు