బాధ్యతలు మోయడం ఆషామాషీ కాదు

3 Jul, 2013 09:50 IST|Sakshi
బాధ్యతలు మోయడం ఆషామాషీ కాదు

‘‘కేశాలంకరణ, దుస్తులు, శారీరక భాష, ఉచ్చారణ... ఇవి కళాకారులకు ఆయుధాల్లాంటివి. పాత్రకు తగ్గట్టుగా ఈ ఆయుధాలను వాడుకుంటే ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టేయొచ్చు. వీటిని ఎలా కావాలంటే అలా విభిన్నంగా వాడుకోవడానికి వీలుగా ఉన్న పాత్రలు నాకు రావడం నా అదృష్టం’’ అంటున్నారు విద్యాబాలన్. ఎలాంటి పాత్ర అయినా సునాయాసంగా చేసేయగలదనే పేరు తెచ్చుకున్న ఈ హోమ్లీ బ్యూటీ పెళ్లి ద్వారా వచ్చిన అదనపు బాధ్యత గురించి చెబుతూ -‘‘ అంతకు ముందు ఇంటి విషయాలను పట్టించుకునేదాన్ని కాదు.
అన్నీ అమ్మే చూసుకునేది. కానీ ఇక ఆ ఆటలు చెల్లవు. నేనో ఇంటికి యజమానురాలిని. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి నా వంతు కృషి చేస్తున్నా. ‘ఈరోజు ఏ వంట చెయ్యమంటారమ్మా’ అంటూ వంటావిడ ఫోన్ చేయగానే, ఇంట్లో ఎవరెవరికి ఏమేం నచ్చుతాయో ఓసారి చెక్ చేసుకుంటాను. షూటింగ్ లొకేషన్లో కూర్చుని, లిస్ట్ తయారు చేసి చెప్పేస్తాను. ఎప్పుడైనా పనిమనిషి సెలవు అడిగితే చాలు ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది.

పుట్టింట్లో ఉన్నంతవరకూ నాకివేవీ లేవు. అత్తింటికి వచ్చిన తర్వాత అంతా కొత్తగా ఉంది. ఇంటి బాధ్యతలు మోయడం ఆషామాషీ కాదని తెలుసుకున్నా. టెన్షన్‌తో కూడుకున్న వ్యవహారమే కానీ చాలా బాగుంది. సిద్దార్థ్‌రాయ్‌తో నా జీవితం చాలా హాయిగా ఉంది. చెబితే నవ్వుతారేమో కానీ నాకైతే ఇంకా హనీమూన్ దశలోనే మా జీవితం ఉన్నట్లనిపిస్తోంది’’ అన్నారు.