బాలీవుడ్ బెటర్

30 May, 2016 04:11 IST|Sakshi
బాలీవుడ్ బెటర్

కోలీవుడ్ వెనుక పడిపోయింది అంటున్నారు న టి నదియా. ఒకప్పటి సూపర్ హీరోయిన్ అయిన నదియా ఇప్పుడు సూపర్ మామ్ అయ్యారు. అయితే అందమైన అమ్మగా తమిళంలో రీఎంట్రీ అయిన ఈమె ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. 40 ఏళ్లు మీద పడ్డ నదియాకు అంత వయసు ఉందని అనిపించదు. ఈ గ్లామర్ రహస్యం ఏమిటోగానీ తన క్రేజ్‌తో ఇప్పటికీ వాణిజ్య ప్రకటనలకు నదియాకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి నదియా కోలీవుడ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. తన లాంటి 40 ఏళ్ల ప్రౌఢలకు ఇక్కడ పాత్రలు తక్కువేనని ఈ విషయంలో బాలీవుడ్ చాలా బెటర్ అనీ పేర్కొన్నారు.

అక్కడ నటీమణుల కోసం మంచి పాత్రలు రూపొందిస్తున్నారని అన్నారు. మీరూ హిందీలో నటించవచ్చుగా అని అడుగుతున్నారని, అక్కడ తనకు అవకాశాలు వస్తున్నాయని,ఇటీవల కూడా ఒక తమిళ చిత్రం రీమేక్‌లో నటించమని అడిగారని తెలిపారు. అయితే ఆ చిత్రంలో పాత్ర తనకు తగ్గదిగా లేకపోవడంతో నిరాకరించినట్లు చెప్పారు. దక్షిణాదిలో తనకు అవకాశాలు బాగా వస్తున్నాయని, అయితే ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం తరువాత తనను అందరూ అందమైన అమ్మగానే చిత్రీకరించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. వేరే విధంగా చూపించడం సాధ్యం కాదా?అంటూ ప్రశ్నించారు. 40 ఏళ్ల స్త్రీల గురించి పాత్రలు సృష్టించడానికి ఎన్నో విషయాలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని దర్శకులు దృష్టిలో పెట్టుకోవాలని నదియా సూచించారు.