నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ

6 Jan, 2020 08:38 IST|Sakshi

జేఎన్‌యూలో జరిగిన దుండగుల దాడిపై బాలీవుడ్‌ తారలు స్పందించారు. హీరోయిన్‌ స్వరా భాస్కర్‌, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్విటర్‌ వేదికగా ఈ హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి జవహర్‌ లాల్‌ నెహ్రు యూనివర్సిటీలోకి చోరబడి వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. విచక్షణా రహితంగా రాళ్లతో, ఇనుప రాడ్లతో విద్యార్థులపై దాడి చేయడంతో విద్యార్థులతోపాటు జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్‌, ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, నటి స్వరా భాస్కర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం స్వరా భాస్కర్‌ తల్లి జేఎన్‌యూలో ఉంటూ.. ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. యూనివర్సిటీలోని విద్యార్థులకు సహాయం అందిచాలని తన తల్లిని కోరారు. ‘‘ఢిల్లీ వాసులకు అర్జెంట్‌ అప్పీల్‌. బాబా మంగ్నాథ్‌ మార్గంలోని ప్రధాన గేట్‌ బయట పెద్ద సంఖ్యలో గుమిగూడండి. ముసుగులో ఉన్న ఏబీవీపీ వాళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి తీసుకురండి’’ అని కోరారు.(జేఎన్‌యూలో దుండగుల వీరంగం)

స్వరా పోస్టు చేసిన దానిపై స్పందించిన షబానా అజ్మీ..దాడిని కేవలం ఖండిస్తే సరిపోదు. ఈ చర్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే క్యాంపస్‌లో జరిగిన హింసకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకున్నారు. ‘ఇదంతా నిజంగా జరుగుతుందా... ఓ పీడకలలా అనిపిస్తోంది. నేను ఇండియాలో లేను. దాడి కారణంగా 20 మంది విద్యార్థులు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు’ అని షబానా పేర్కొన్నారు. కాగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించాల్సిన చోట ఇలా జరగడం దారుణమని, ఇది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతుందని హీరోయిన్‌ తాప్సీ అన్నారు.. వీరితో పాటు రితేష్‌ దేశ్‌ముఖ్‌, దియా మిర్జా, విశాల్‌ దాద్లానీ సైతం ఈ ఘటనపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా