బాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్స్

13 Mar, 2016 11:38 IST|Sakshi
బాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్స్

ఇన్నాళ్లు స్టార్ హీరోల వెంట పరిగెత్తిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు లేడి ఓరియంటెడ్ సినిమాలతో హీరోయిన్లూ వందల కోట్ల కలెక్షన్లు సాధించగలరని ప్రూవ్ అవ్వటంతో ఆ తరహా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు కూడా కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితం కాకుండా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ల మీద దృష్టి పెడుతున్నారు.

ఈ లిస్ట్ అందరికంటే ముందున్న బ్యూటి ప్రియాంక చోప్రా. మేరికోమ్ సినిమాతో సత్తా చాటిన ఈ బ్యూటి, ఇప్పుడు హాలీవుడ్లోనూ జెండా పాతేసింది. క్వాంటికో సీరీస్తో హాలీవుడ్లో సక్సెస్ సాధించిన ప్రియాంక ప్రస్తుతం బేవాచ్తో మరోసారి సత్తా చాటడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే భారీ వసూళ్లను రాబట్టగలిగిన కమర్షియల్ స్టార్గా ప్రూవ్ చేసుకున్న ప్రియాంకతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంకతో సినిమా చేస్తే అంతర్జాతీయ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు.

చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ వారసురాలు సోనమ్ కపూర్ కూడా లేడి ఓరియంటెడ్ సినిమాతో కల నెరవేర్చుకుంది. ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ నీర్జాతో తన కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న సోనమ్, ఇదే సినిమాతో వంద కోట్ల మార్క్ను కూడా రీచ్ అయ్యేలా ఉంది. ఇక లేడి ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బాలీవుడ్ హాట్ బ్యూటి కంగనారనౌత్, ఇప్పటికే అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ఫ్యాషన్, క్వీన్,  తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి సినిమాలతో లేడి స్టార్లకు కూడా వందకోట్ల వసూళ్లు సాధ్యమే అని ప్రూవ్ చేసింది.

గ్లామర్ హీరోయిన్గా టాప్ క్రేజ్ ఉన్న దీపిక కూడా నటిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్తో కలిసి పికు సినిమాలో నటించిన ఈ బ్యూటి, తాను కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితం కాదంటూ తేల్చేసింది. అదే జోష్లో ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం చేస్తూ బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్లో స్థానం సంపాదించుకుంది.

వీళ్లే కాదు బాలీవుడ్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, విద్యాబాలన్, అనుష్క శర్మ లాంటి హీరోయిన్లు కూడా లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా లేడి ఓరియంటెడ్ సినిమాలను కూడా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.