బాలీవుడ్ 'ట్రాజెడీ కింగ్' బర్త్ డే

11 Dec, 2015 15:01 IST|Sakshi
బాలీవుడ్ 'ట్రాజెడీ కింగ్' బర్త్ డే

రొమాంటిక్, కామిక్, హిస్టారిక్, సోషల్, ట్రాజెడీ ఇలా పాత్ర ఏదైన తనదైన హావభావాలతో రక్తి కట్టించే బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్. దేవదాస్, మొగళ్ ఈ అజం, అందాజ్ లాంటి సినిమాలతో భారతీయ సినీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ఈ గ్రేట్ యాక్టర్ ఈ రోజు (శుక్రవారం) తన 93వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సౌత్ సినిమాతో కూడా విడదీయలేని అనుబందం ఉన్న ఆయన, చెన్నైలో సంభవించిన ప్రకృతి బీభత్సం కారణంగా ఈ సారి తన పుట్టినరోజు వేడకలకు దూరంగా ఉన్నారు.

దిలీప్ కుమార్ 1922 డిసెంబర్ 11న ప్రస్తుత పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. చిన్ననాటి నుంచే నటన పట్ల ఆకర్షితులైన ఆయన 1944లో రిలీజ్ అయిన 'జ్వార్ భట' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. 1949లో రిలీజ్ అయిన అందాజ్ దిలీప్ కుమార్కు స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఆ తరువాత వరుసగా ఆన్, దేవదాస్, ఆజాద్, మొగళ్ ఈ అజం, గంగా జయున సినిమాలతో బాలీవుడ్ టాప్ స్టార్గా ఎదిగారు.

దాదాపు 60 ఏళ్ల పాటు బాలీవుడ్ వెండితెరను ఏళిన ఈ గ్రేట్ యాక్టర్ 1976లో ఐదేళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారు. 1981లో క్రాంతి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన మార్క్ చూపించారు. 1998లో విడుదలైన క్విలా దిలీప్ కుమార్ చివరి సినిమా ఆ తరువాత వయోభారం కారణంగా ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన్ను వరించాయి.

భారతీయ చలనచిత్ర చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డ్ను తొలిసారిగా అందుకున్న నటుడు దిలీప్ కుమార్. అంతేకాదు అత్యధికంగా ఎనిమిది సార్లు ఈ అవార్డును అందుకున్న ఏకైక నటుడు ఆయన. భారత ప్రభుత్వం అందించే పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ లాంటి అవార్డులు సైతం ఆయన్ను వరించాయి. పాకిస్థాన్ లో జన్మించిన దిలీప్ కుమార్ను అక్కడి ప్రభుత్వం 'నిషాన్ ఈ ఇంతియాజ్' అవార్డ్తో గౌరవించింది. భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి కీర్తిని అందించిన లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.