రీమేక్‌ కుమార్‌

15 Nov, 2019 02:25 IST|Sakshi
అక్షయ్‌ కుమార్‌, బెల్‌ బాటమ్‌లో... ,బచ్చన్‌ పాండేలో...,∙లక్ష్మీ బాంబ్‌లో...

ఏడాదికి మూడు సినిమాలతో హిందీ ప్రేక్షకులను పలకరిస్తారు అక్షయ్‌ కుమార్‌. దేశభక్తి, యాక్షన్, సోషల్‌ మెసేజ్, మల్టీస్టారర్‌ కామెడీ జానర్లలో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారాయన. అప్పుడప్పుడు రీమేక్‌ సినిమాల్లోనూ మెరుస్తుంటారు. కానీ, ఇటీవల అక్షయ్‌ కుమార్‌ సినిమాల ఎంపిక చూస్తుంటే... ఆయన ఆసక్తి రీమేక్స్‌ మీదకు మళ్లినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అక్షయ్‌ చేతిలో ఉన్న 5 సినిమాల్లో 3 రీమేక్సే కావడం విశేషం. తమిళంలో హిట్‌ అయిన ‘వీరమ్‌’ ఆధారంగా ‘బచ్చన్‌ పాండే’ సినిమా చేస్తున్నారు. సౌత్‌ ఆడియన్స్‌ను భయపెట్టిన ‘కాంచన’ను ‘లక్ష్మీబాంబ్‌’గా చుడుతున్నారు. తాజాగా ‘బెల్‌ బాటమ్‌’ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా అధికారికంగా ‘బెల్‌బాటమ్‌’ చిత్రానికి రీమేక్‌ కాకపోయినా, ఆ సినిమా స్ఫూర్తిగా సాగనుందని టాక్‌. ఆ చిత్ర విశేషాలేంటో చదువుదాం.

లక్ష్మీ బాంబ్‌
హారర్‌–కామెడీ సినిమాల్లో ‘కాంచన’ సిరీస్‌ సౌత్‌లో సూపర్‌ సక్సెస్‌ఫుల్‌. అన్యాయంగా హత్య చేయబడ్డ ఓ వ్యక్తి ఆత్మ రాఘవ లారెన్స్‌ శరీరంలోకి ప్రవేశించి తన పగను తీర్చుకోవడం అనేది ఈ సిరీస్‌లోని సినిమాల కథ. అన్యాయానికి గురై హత్య చేయబడ్డ ఓ హిజ్రా ఆత్మగా మారి ఎలా పగ తీర్చకుందనేది ‘కాంచన 2’ సినిమా కథ. ‘కాంచన’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవ లారెన్స్‌ ‘లక్ష్మీ బాంబ్‌’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌లో లారెన్స్‌కి ఇదే తొలి సినిమా. 2020 జూన్‌ నెలాఖరులో ‘లక్ష్మీ బాంబ్‌’ థియేటర్స్‌లో పేలనుంది.

వీరమ్‌– బచ్చన్‌ పాండే
ఒక ఊరిలో పంచ పాండవుల్లాంటి అన్నదమ్ములు. నలుగురు తమ్ముళ్లంటే అన్నయ్యకు వల్లమాలిన ప్రేమ. పెళ్లి చేసుకుంటే అన్మదమ్ముల అనుబంధం దెబ్బతింటుందేమోనని వద్దనుకుంటాడు. తమ్ముళ్లను కూడా అదే ఫాలో అవ్వమంటాడు. అన్న చాటుగా పెరిగిన తమ్ముళ్లు అన్నకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతారు. తమ ప్రేమలకు గ్రీన్‌ సిగ్నల్‌ పడాలంటే అన్నయ్య కూడా ప్రేమలో పడాలని తమ్ముళ్లు ప్రయత్నాలు మొదలుపెడతారు. అందరూ కలసి అన్న మనసు మార్చారా? లేదా? తర్వాత ఏం జరిగింది? అన్నది ‘వీరమ్‌’ కథాంశం. అజిత్‌ హీరోగా శివ తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగులో ‘కాటమరాయుడు’ టైటిల్‌తో పవన్‌ కల్యాణ్‌ రీమేక్‌ చేశారు. ఈ చిత్ర హిందీ రీమేక్‌ ‘బచ్చన్‌ పాండే’ 2020 క్రిస్మస్‌కు విడుదల కానుంది.

బెల్‌ బాటమ్‌
జేమ్స్‌బాండ్‌ సినిమాలు, డిటెక్టివ్‌ సినిమాలు విపరీతంగా చూసి, క్రైమ్‌ నవలలు బాగా చదివి డిటెక్టివ్‌ల మీద ఒకలాంటి ఇష్టం ఏర్పరచుకుంటాడు హీరో. వృత్తికి కానిస్టేబుల్‌ అయినా డిటెక్టివ్‌గా ఫీల్‌ అవుతాడు. ఓ మర్డర్‌ మిస్టరీని అవలీలగా పరిష్కరిస్తాడు. దీంతో ఓ భారీ దొంగతనం కేసును పరిష్కరించే బాధ్యతని హీరోకి అప్పచెబుతుంది ప్రభుత్వం. ఈ కేసులో ప్రమేయం ఉన్న వాళ్లని ఎలా పట్టుకున్నాడన్నదే ‘బెల్‌ బాటమ్‌’ కథాంశం. రిషబ్‌ శెట్టి హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను జయ తీర్థ తెరకెక్కించారు.

కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘బెల్‌ బాటమ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు అక్షయ్‌. 2021 జనవరిలో ఈ సినిమా  థియేటర్స్‌లో సందడి చేయనుంది. బాలీవుడ్‌కు కథలు అవసరమున్నప్పుడల్లా సౌత్‌ ఇండస్ట్రీ సూపర్‌ హిట్‌ కథలు ఇస్తూ వస్తోంది. సల్మాన్‌ ఖాన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సక్సెస్‌పుల్‌ స్టార్ట్‌ (తెలుగు ‘పోకిరి’ చిత్రాన్ని ‘వాంటెడ్‌’గా రీమేక్‌ చేశారు) ఇచ్చింది రీమేకే. బాలీవుడ్‌కు తొలి వంద కోట్ల గ్రాసర్‌ని ఇచ్చింది (గజిని) సౌత్‌ రీమేకే. కథ కావాల్సినప్పుడల్లా బాలీవుడ్‌ను పలకరించే దక్షిణాది బంధువు రీమేకే.

గత రీమేక్‌లు
అక్షయ్‌ కుమార్‌ గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ సినిమాని ‘రౌడీ రాథోడ్‌’గా, తమిళ ‘రమణ’ చిత్రాన్ని ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’గా, తమిళ ‘తుపాకి’ చిత్రాన్ని ‘హాలిడే’గా, మలయాళ ‘మణిచిత్రతాళ్‌’ సినిమాను ‘భూల్‌ బులయ్య’గా, మలయాళ ‘రామ్‌జీ రావ్‌ స్పీకింగ్‌’ను ‘హేరా ఫేరీ’గా రీమేక్‌ చేశారు.

కత్తి పట్టనున్నారు
ఏఆర్‌ మురగదాస్, విజయ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ తమిళ చిత్రం ‘కత్తి’. మల్టీనేషనల్‌ కంపెనీల ప్రభావం సామాన్య రైతుల మీద ఎలా పడుతోంది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అక్షయ్‌ కుమార్‌ రీమేక్‌ చేస్తారని తెలిసింది. ఏఆర్‌ మురగదాస్‌ దగ్గర పనిచేసిన జగన్‌ శక్తి ఈ రీమేక్‌ను డైరెక్ట్‌ చేస్తారట. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా