పాత్రకు... ప్రీతిపాత్రుడు

17 Nov, 2015 00:30 IST|Sakshi
పాత్రకు... ప్రీతిపాత్రుడు

నటనకు పరిపూర్ణతను ఇచ్చిన నటుడు సయీద్ జాఫ్రీ! ఆరడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన ముఖం, బేస్ వాయిస్ లాంటి ప్లస్ పాయింట్స్ ఏమీ లేకుండానే... అవన్నీ ఉన్న నటులను సైతం ఆయన అడుగు దూరంలో ఉంచగలరు! సయీద్ జాఫ్రీని చూసి హాలీవుడ్ నటడు సీన్ కేనరీ జంకిందీ,  కెమెరా ముందు సయీద్ ఈజ్‌ను చూసి రిచర్డ్ అటెన్‌బరో ముచ్చట పడిందీ అందుకేనేమో!

సయీద్ 1929 జనవరి 8న పంజాబ్‌లో జన్మించారు. పై చదువుల తర్వాత ఢిల్లీకి వచ్చాక థియేటర్ మీద దృష్టిపెట్టారు.  యూనిటీ థియేటర్ పేరుతో డ్రామా కంపెనీ ప్రారంభించాడు. అమెరికాలో షేక్‌స్పియర్ నాటకాలను ప్రదర్శించిన తొలి భారతీయ నటుడు సయీదే. లండన్‌లోని అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్‌లో చేరి నటనకు మెరుగులద్దుకున్నారు. రంగస్థల సేవలకు 1995లో ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్’ అవార్డ్ అందుకున్నారు.
 
ప్యారలల్... కమర్షియల్: డెబ్భైల్లో ఇటు ప్యారలల్ మూవీ డెరైక్టర్స్‌కి, అటు కమర్షియల్ మూవీ డెరైక్టర్స్‌కి అభిమానపాత్రుడు సయీదే. ప్రేమ్‌చంద్ రాసిన ‘షత్రంజ్ కే ఖిలాడీ’ కథను అదే పేరుతో సత్యజిత్‌రే తెరకెక్కిస్తే, చదరంగ వ్యసనపరుడైన మీర్ రోషన్ అలీ పాత్రను పోషించారు సయీద్. ఆ సినిమా పేరు వినగానే సయీద్ జాఫ్రీనే కళ్ల ముందు మెదులుతారు.

సత్యజిత్‌రేకే కాదు... శ్యామ్‌బెనెగల్, సాయి పరాంజపే లాంటి గొప్ప దర్శకులకూ ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్. హైదరాబాద్ పాతబస్తీలోని మెహబూబ్‌కి మెహందీని నగర శివార్లకు తరలించిన నేపథ్యంలో ఆ కథాంశంతో శ్యామ్‌బెనెగల్ తెరకెక్కించిన ‘మండీ’ సినిమాలో అగ్రవాల్‌గా, సాయి పరాంజపే ‘చష్మే బద్దూర్’లో పాన్‌డబ్బా ఓనర్ లలన్ మియాగా జస్ట్ జీవించారు! ‘రామ్ తేరీ గంగా మైలీ’ లాంటి కమర్షియల్ సినిమాలైతే ఆయనకు బాహే హాత్ కా ఖేల్! ‘గాంధీ’లో సర్దార్ పటేల్ రోల్‌లో ఒదిగిపోయారు.
 
హాలీవుడ్ అండ్ టెలివిజన్: ‘ఎ ప్యాసేజ్ టు ఇండియా, ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్’... ఇలా ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలతో హాలీవుడ్ ఆయనను సత్కరించింది. గ్యాంగ్‌స్టర్స్, ది జ్యువెల్ ఇన్ ద క్రౌన్ , తందూరీ నైట్స్ వంటి సీరియల్స్‌లో సయీద్‌ని చూపించుకొని గర్వపడింది టెలివిజన్. నటనను వృత్తిలా కాక శ్వాసలా భావించారు సయీద్. అందుకే, ప్రేక్షకులు బ్యానర్, కథ, దర్శకుడు, హీరో హీరోయిన్లతో సంబంధం లేకుండా పోస్టర్ మీద సయీద్ బొమ్మ కనపడితే సినిమాకు వెళ్లేవారు.

ఈ ఇమేజ్ ముందు ఏ స్టార్‌డమ్ నిలుస్తుంది! ఈ ప్రతిభకు ఏ గ్లోబల్ అవార్డ్ కొలమానం అవుతుంది? 86 ఏళ్ల సయీద్ బ్రెయిన్ హెమరేజ్‌తో నవంబర్ 15న అల్విదా చెప్పి వెళ్లిపోయారు కానీ అభిమానులు ఆయనకు అల్విదా చెప్పలేదు.. చెప్పలేరు. వెండివెలుగులో సయీద్ జాఫ్రీ... ఇమ్మోర్టల్.       - సరస్వతి రమ