-

రాజకీయాలంటే సినీ పరిశ్రమకు హడల్

22 Oct, 2016 15:07 IST|Sakshi
రాజకీయాలంటే సినీ పరిశ్రమకు హడల్

ముంబై: జాతీయతావాదం విషయంలో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కటిగా ఉంటుందని హీరో అజయ్ దేవగణ్ అన్నాడు. కాగా జాతీయవాదానికి, బాలీవుడ్కు మధ్య రాజకీయాలు చొరబడితే సినీ పరిశ్రమ తీవ్రంగా ఆందోళన చెందుతుందని, నష్టపోతుందని చెప్పాడు.

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన కరణ్‌ జోహార్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ సినిమాను విడుదల చేయబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించడంతో పాటు సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎంఎన్ఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, ఇతర నిర్మాతలు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ అధినేత్ రాజ్ ఠాక్రేలను కలసి చర్చించారు. పాక్ నటులకు అవకాశం ఇవ్వబోమని హామీ ఇవ్వడంతో కరణ్ సినిమా విడుదలకు లైన్ క్లియరైంది.

ఈ నేపథ్యంలో జాతీయవాదంతోనా లేక భయం కారణంగా సినిమా పరిశ్రమ ఒక్కటిగా నిలిచిందా అన్న ప్రశ్నకు.. అజయ్ దేవగణ్ రెండూ కారణమని చెప్పాడు. 'జాతీయతావాదం విషయంలో నేనెప్పుడూ దేశం వెంటే ఉంటా. అదే రాజకీయాల విషయం వచ్చే సరికి సినీ పరిశ్రమ వణికిపోతుంది. ఈ రోజుల్లో ఏ వర్గానికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడినా సమస్యలు తప్పవు. సినిమా విడుదల కాకుండా ఆపేస్తారు. జాతీయతావాదం విషయంలో బాలీవుడ్ పరిశ్రమ చీలిపోతుందని భావించడంలేదు. రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తాం. అయితే జాతీయత విషయంలో మేం దేశం వెంటే' అని అజయ్ దేవగణ్ అన్నాడు.