ఆ క్రేజ్‌ ఇంతింత కాదయా

16 Dec, 2018 00:03 IST|Sakshi
బోనీ కపూర్‌ ఫ్యామిలీ

స్టార్స్‌ అప్‌లోడ్‌ చేసిన ఫొటోలన్నిటికీ ప్రశంసలు వస్తాయంటే పొరపాటే. అప్పడప్పుడు విమర్శలు కూడా వస్తాయి. కత్రినాకైఫ్, ఫాతిమా సనా షేక్‌ లాంటి వారు ఆ అనుభవాన్ని చవి చూసినవారిలో కొందరు. వాళ్లు పెట్టిన ఫొటోలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. వెయ్యి మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటో చెబుతుందంటారు. అందుకే స్మార్ట్‌ ఫోన్స్‌ వచ్చిన తర్వాత సెల్ఫీల ట్రెండ్‌ కూడా పెరిగింది. ఇక సోషల్‌ మీడియాలో అయితే రోజుకో ఫొటో అయినా అప్‌లోడ్‌ చేయనిదే కునుకు తీయని నెటిజన్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. వివాదం అయినా, విశేషం అయినా ఒకే ట్వీట్‌తోనే, ఇన్‌స్టా స్టోరీతోనే.. ఏదో ఒక సోషల్‌మీడియా యాప్‌ ద్వారానో తమ అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘మీటూ’ ఉద్యమంలో సోషల్‌ మీడియా ఎంత కీలక పాత్ర పోషించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోషల్‌ మీడియాలో సినిమా ప్రమోషన్స్‌ కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేయబడిన కొన్ని ఫొటోలను నెటిజన్లు విపరీతంగా వైరల్‌ చేశారు. దాన్ని బట్టే ఆ ఫొటోల క్రేజ్‌ ‘ఇంతింత కాదయా’ అనొచ్చు. వాటిలో కొన్నింటిపై లుక్కేద్దాం.

ఒకే ఫ్రేమ్‌లోకి బోనీ కుటుంబం
ఈ ఏడాది ఫిబ్రవరిలో అతిలోకసుందరి శ్రీదేవి మరణించినప్పుడు సినీలోకం కన్నీరు కార్చింది. బోనీకపూర్‌ రెండో భార్య శ్రీదేవి అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 1983లో మోనా కపూర్‌ను  వివాహం చేసుకున్నారు బోనీ కపూర్‌. 1996లో బోనీ–మోనా విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతనే ఇప్పటి బాలీవుడ్‌ హీరో అర్జున్‌కపూర్‌. మోనా నుంచి విడాకులు తీసుకుని 1996లోనే శ్రీదేవిని వివాహం చేసుకున్నారు బోనీ కపూర్‌. శ్రీదేవికి–బోనీకి జాన్వీ, ఖుషీ అని ఇద్దరు కుమార్తెలు సంతానం.

అయితే మొదటి భార్య కుటుంబానికీ, రెండో భార్య కుటుంబానికీ పెద్దగా అనుబంధం ఉండేది కాదు. కానీ శ్రీదేవి చనిపోయాక రెండు కుటుంబాలూ కలిశాయి. జాన్వీ, ఖుషీలకు అర్జున్‌కపూర్‌ అండగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏడడుగులు వేసిన సోనమ్‌ కపూర్‌ పెళ్లి రిసెప్షన్‌ ముంబైలో జరిగినప్పుడు బోనీ ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఆ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఇది హ్యాపీ మూమెంట్‌ అయితే విషాద సంఘటన శ్రీదేవి అంత్యక్రియల  తాలూకు ఓ ఫొటో కూడా నెట్టింట్లో వైరల్‌ అయింది. అభిమాన తార చివరి ఫొటోను అభిమానులు పదే పదే చూశారు.

చిన్నోడు.. చిన్నారి.. క్రేజ్‌ బోలెడు
బాలీవుడ్‌లో సైఫ్‌ అలీఖాన్‌–కరీనాకపూర్‌ ముద్దుల తనయుడు తైముర్‌ అలీఖాన్, షాహిద్‌ కపూర్‌–మీరా రాజ్‌పుత్‌ దంపతుల కుమార్తె మిషా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం చూస్తుంటాం. ఈ ఏడాది ఆగస్టు 2న రెండేళ్లు పూర్తి చేసుకుంది బేబీ మిషా  కపూర్‌. ఈ బర్త్‌డే వేడుకలకు ముందు ముద్దుల కూతురు మిషాతో ఓ ఫొటోషూట్‌ చేయించుకున్నారు మీరా రాజ్‌పుత్‌. ఆ ఫొటోలు ఫుల్‌గా వైరల్‌ అయ్యాయి. చిన్నోడు తైముర్, చిన్నారి మిషాలకు బోల్డంత క్రేజ్‌.

ఈ ఏడాది బాలీవుడ్‌లో పెళ్లి సన్నాయి బాగా వినిపించింది. అందులో సోనమ్‌ కపూర్‌–ఆనంద్‌ ఆహుజాల పెళ్లి ఒకటి. దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్‌ చేసుకున్న తర్వాత సోనమ్‌–ఆనంద్‌ ఈ ఏడాది మేలో ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఓ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు క్లిక్‌మన్న ఫొటో నెటిజన్లను బాగా మెప్పించింది. నిక్‌ జోనస్, ప్రియాంకా చోప్రా పెళ్లివేడుక సంబరాలు సోషల్‌ మీడియాలో బాగానే హల్‌చల్‌ చేశాయి. ఈ నెల 1,2 తేదీల్లో జో«ద్‌పూర్‌లో ఈ జంట రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలకు మొబైల్స్, కెమెరాల అనుమతి లేకపోవడంతో నిక్‌–ప్రియాంకా ఫొటోలు వారు రిలీజ్‌ చేసే వరకు బయటకు రాలేదు. ఆ తర్వాత కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు నిక్‌ అండ్‌ ప్రియాంకా చోప్రా.

ఇన్‌స్టాగ్రామ్‌ లిస్ట్‌లో
ట్వీటర్‌ అకౌంట్‌ ఉన్నప్పటికీ కొందరు స్టార్స్‌ కూడా ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమిర్‌ ఖాన్, కమల్‌హాసన్, రజనీకాంత్, మమ్ముట్టి, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కత్రినా కైఫ్, ఐశ్వర్యారాయ్‌... ఈ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్స్‌ తెరిచిన కొందరు స్టార్స్‌.


మీరా రాజ్‌పుత్, మిషా


ఆనంద్, సోనమ్‌


నిక్‌ జోనస్, ప్రియాంక
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా