‘పద్మావతి’ ఆర్థిక సహకారంపై ఈడీ దర్యాప్తు!?

29 Nov, 2017 09:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ సీనియర్‌ లీడర్‌ సుబ్రమణ్యస్వామి మరోసారి బాలీవుడ్‌ చిత్రాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్రపరిశ్రమలో.. ప్రధానంగా ’బాంబే మూవీస్‌‘కు దుబాయ్‌నుంచే ఆర్థిక సహకారం అందుతోందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావతి’ కేంద్రంగా స్వామి విమర్శల జడివాన కురిపించారు. రాణీ పద్మావతి తన ఆదర్శ వ్యక్తిత్వం, ప్రాణత్యాగంతో ఎందరికో స్ఫూర్తి ప్రదాయకంగా నిలిచారు. అటువంటి రాణీ పద్మావతిని ఈ చిత్రంలో కేవలం ఒక నృత్య కళాకారిణిగా చూపించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నరహంతకుడు, కర్కోటకుడు అయిన అల్లావుద్దీన్‌ ఖిల్జీని.. ఈ చిత్రంలో గొప్పవ్యక్తిగా చూపించడంపై ఆయన విమర్శించారు. పద్మావతి చిత్రం చుట్టూ అల్లుకున్న ఇటువంటి అనేక అనుమానాల వల్ల.. బాంబే చిత్రాలన్నింటికీ.. దుబాయ్‌ నుంచి ఆర్థిక సహకారం లభింస్తోందన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు.


బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఆర్థిక లావాదేవీలపై సుప్రీంకోర్టు పరిశీలన చేయాలని ఆయన చెప్పారు. బాలీవుడ్‌ చిత్రాలన్నీ.. భారతీయుల కొరకు, భారతీయుల కోసం నిర్మించాలని ఆయన అన్నారు. ఇదిలాఉండగా.. పద్మావతి చిత్రానికి దుబాయ్‌ కేంద్రంగా ఆర్థిక సహకారం ఉందన్న స్వామి వ్యాఖ్యలపై సీబీఎఫ్‌సీ సభ్యుడు అర్జున్‌ గుప్తా స్పందించారు. స్వామి వ్యాఖ్యలపై ఆయన ప్రధానమంత్రి మోదీకి లేఖ రాస్తూ.. పద్మావతి చిత్ర ఆర్థిక సహకారంలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)తో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు