జియా ఖాన్ మృతి కేసులో కొత్త మలుపు

25 Feb, 2016 19:33 IST|Sakshi

మూడేళ్ల క్రితం బాలీవుడ్ వర్థమాన తార జియాఖాన్ ఆత్మహత్య సంచలనం రేపిన విషయం విదితమే. జియా రాసిన సూసైడ్ నోట్ ద్వారా సూరజ్ పంచోలీతో ప్రేమకు సంబంధించి పలు కీలక వివరాలు వెల్లడయ్యాయి. అయితే జియాది ఆత్మహత్య కాదని, ప్రియుడు సూరజ్ పంచోలీనే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. అప్పట్లో పంచోలీని అరెస్ట్ చేసినా, కొన్ని రోజుల విచారణ అనంతరం బెయిల్పై విడుదల అయ్యాడు. ముంబై హై కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది.

కాగా రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం జియా ఖాన్ ది హత్య కాదు, ఆత్మహత్యేనంటూ సీబీఐ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జియా తల్లి రబియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ ఆర్ వి మోరే, జస్టిస్ వి ఎల్ అచిలియాలు  సభ్యులుగా ఉన్న బెంచ్ గురువారం ఈ కేసుకు సంబంధించి మధ్యంతర స్టే విధించింది. రెండు వారాల్లో పిటిషనర్ కు సమాధానంగా అఫడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.

జియా తల్లి రబియా తన పిటిషన్ లో.. ప్రత్యేక విచారణ బృందానికి(ఎస్ఐటి) అప్పగించాలని, విచారణను ఎప్పటికప్పుడు హైకోర్టు పరిశీలిస్తుండాలని కోరారు. జియా అమెరికా పౌరురాలైనందున కేసు విచారణలో ఎఫ్బిఐ ను కూడా భాగం చేయాలని ఆమె విన్నవించారు. కొంతమంది పోలీసు అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

జియా మృతి కేసులో సీబీఐ నిజాయితీగా విచారించలేదని, ఒత్తిడులకు తలొగ్గి వీలైనంత త్వరగా కేసును మూసివేయాలని చూస్తున్నారని రబియా ఆరోపించారు. అమెరికా కాన్సులేట్ ను కూడా సీబీఐ తప్పుడు విచారణతో తప్పు దోవ పట్టించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.