టైటిల్ వివాదానికి తెర దించాడు

5 Jan, 2016 11:44 IST|Sakshi
టైటిల్ వివాదానికి తెర దించాడు

మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే, కోలీవుడ్లో సినీ రంగానికి, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. అందుకే అక్కడి సినిమాలు, సినీ నటులు ఎప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంటారు. ఇలా వివాదాల్లో ఇరుక్కున్న ఓ సినిమా ఇప్పుడు బయటపడింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగళూర్ డేస్' తమిళ రీమేక్, టైటిల్ వివాదం సద్దుమణిగింది.

రానా, ఆర్య, శ్రీ దివ్య, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రీమేక్ సినిమాకు ముందుగా 'అర్జున్ దివ్య మీనాక్షి కార్తీక్' అనే పేరు పెట్టారు. అభిమానులకు ఈ పేరును షార్ట్ కట్లో ఏడీఎంకే అని అలవాటు చేశారు. దీంతో వివాదం మొదలైంది. తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పేరు అన్నాడీఎంకే కావటంతో సినిమా విడుదల నిలిపివేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి.

గతంలో విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమాకు మదగజ రాజా అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ సినిమాను షార్ట్ ఫాంలో ఎమ్జిఆర్ అని పిలవటంతో ఆ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. దీంతో తమ సినిమా విషయంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందేమో అన్న ఆలోచనతో భాస్కర్ తన సినిమా టైటిల్ను మార్చేశాడు. ఇప్పటివరకు ఏడియంకేగా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'బెంగళూరు నాట్గల్' అనే పేరును ఫైనల్ చేశారు. దీంతో చాలా రోజులుగా నలుగుతున్న టైటిల్ వివాదానికి తెరపడింది.