‘మొదటి మూవీకే శ్రీదేవి నటనను ఆశించడం తప్పు’

16 Feb, 2020 14:46 IST|Sakshi

ముంబై : కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో తనకు ప్రస్తుతం సంబంధాలు  తగ్గిపోయాయని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిందీ రిమేక్‌ ‘పింక్‌’  సినిమాను తెలుగులో బోనీ కపూర్‌, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇటీవల బోనీ కపూర్‌ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పిల్లలు అర్జున్‌, అన్షులా, జాన్వీ ,ఖుషిపై అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బోనీ కపూర్‌ ఎప్పుడూ బహిరంగంగా చెప్పరు. ఎందుకని ప్రశ్నించగా.. పిల్లలపై తనకున్న ప్రేమ సహజమని, అది బయటకు చెప్పల్సిన అవసరం లేదని భావిస్తున్నాని అన్నారు. ఈ నలుగురిలో ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారని అడగ్గా.. ఒక తండ్రిగా తనకు నలుగురూ సమానమేనని. కాకపోతే ఖుషి చిన్నది కాబట్టి తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖుషి చదువుల నిమిత్తం విదేశాలలో ఉందని తెలిపారు. 

ఇక బోని కపూర్‌కు నలుగురు పిల్లలు. అర్జున్‌ కపూర్‌, అన్షులా, జాన్వీ, ఖుషీ.. అర్జున్‌, అన్షులా బోని కపూర్‌ మొదటి భార్య మోనా సంతానం కాగా అనంతరం ఆమెకు విడాకులిచ్చి అందాల తార శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ, ఖుషీ ఇద్దరు పిల్లలు.  అన్షులా గురించి మాట్లాడుతూ.. ‘అన్షులా చాలా తెలివైన అమ్మాయి. కొలంబియా యూనివర్సిటీలో చదువుకుంది. మొదట తనకు గూగుల్‌ సంస్థలో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. తనను నేను  ముంబైకి రమ్మని కోరాను. తర్వాత తన పనితనం మెచ్చి కంపెనీ వారు తనను ముంబై ఆఫీస్‌కు పంపించారు. తనను చూస్తుంటేనాకు గర్వంగా ఉంటుంది.’ అని తెలిపారు.

జాన్వీ కపూర్‌పై వస్తున్న విమర్శల గురించి తమ అభిప్రాయం ఏంటని అడగ్గా.. శ్రీదేవి లాంటి నటనను జాన్వీ మొదటి సినిమాకే(ధడక్‌) ఆశించడం సరైనది కాదు. ధడక్‌ చిత్రంలో తన నటనతో అందరిని ఆకట్టుకుందని నేను భావిస్తున్నాను. శ్రీదేవి మరణించిన సమయంలో ఆ  బాధను దిగమింగుకుని మరీ జాన్వీ ఆ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిందని సమాధానమిచ్చారు. 

అదే విధంగా అర్జున్‌ను హీరోగా మీరే ఎందుకు పరిచయం లేదని ప్రశ్నించగా.. ‘అర్జున్‌ ఎప్పుడూ డైరెక్టర్‌ కావాలని అనుకునేవాడు. అందుకే నేనూ కూడా హీరోగా రావాలనే ప్రయత్నం చేయలేదు. కానీ ఓ రోజు సల్మాన్‌ ఫోన్‌ చేసి నటుడికి కావాల్సిన లక్షణాలన్నీ అర్జున్‌లో ఉన్నాయి. అతన్ని నటుడిగా పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పారు. హీరోగా అర్జున్‌కు బీజం వేసింది సల్మానే. అయితే కొన్ని కారణాల వల్ల నాకు, సల్మాన్‌కు సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ హీరోగా అర్జున్‌ హీరోగా ఎదగడానికి సహకరించింది సల్మానే.’అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు