అతిలోకసుందరి ఎవరు?

13 Jan, 2019 10:36 IST|Sakshi

చరిత్రకారుల బయోపిక్‌లు వెండితెరకెక్కుతున్న కాలం ఇది. ఇటీవల మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్‌ నుంచి క్రీడాకారుడు ఎంఎస్‌.ధోని, నటుడు సంజయ్‌దత్, మహానటి సావిత్రి, ఎన్‌టీఆర్, వైఎస్‌.రాజశేఖరరెడ్డి, తాజాగా ఎంజీఆర్, జయలలిత ఇలా చాలా మంది బయోపిక్‌లు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అలా వెండితెర వెలుగు, అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్‌ను వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె భర్త, బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌నే స్వయంగా వెల్లడించారు.

తమిళనాట పుట్టి, తెలుగు చిత్రసీమలో నటిగా ఎదిగి, ఉత్తరాది సినిమాలో వెలిగిపోయిన నాయకి శ్రీదేవి. బాల నటి నుంచి భారతీయ కథానాయకి వరకూ ఖ్యాతి గాంచిన శ్రీదేవి మరణం ఒక విషాదం అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మజిలీలు ఉన్నాయి. అవన్నీ కలిపి చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు, కథ, కథనాలు సిద్ధమైనట్లు బోనీకపూర్‌ ఒక భేటీలో తెలిపారు. శ్రీదేవిగా నటించే నటి కోసం అన్వేషణ జరుగుతోందని, ఈ చిత్రాన్ని హిందీతో పాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ నిర్మించబోతున్నట్లు ఆయన తెలిపారు.

దీంతో శ్రీదేవిగా నటించే అదృష్టం ఎవరికి దక్కనుందన్నది ఆసక్తికరంగా మారంది. మరో విషయం ఏమిటంటే తెలుగులో తెరకెక్కిన ఎన్‌టీఆర్‌ బయోపిక్‌లో శ్రీదేవిగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించింది. దీంతో ఆ అమ్మడిని శ్రీదేవి బయోపిక్‌లో నటింపజేయడానికి పరిశీలించే అవకాశం ఉంటుందా అన్న అంశం గురించి చర్చ జరుగుతోంది. ఈ సంచలన చిత్రం గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం బోనీకపూర్‌ హిందీ చిత్రం పింక్‌ను తమిళంలో రీమేక్‌ చేసే పనిలో ఉన్నా రు. 

అమితాబ్‌బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సంచలన చిత్రం పింక్‌. దీని రీమేక్‌లో అమితాబ్‌బచ్చన్‌ పాత్రను నటుడు అజిత్‌ పోషించనున్నారు. మరో పాత్రలో నటి విద్యాబాలన్‌ నటించనున్నట్లు సమాచారం. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు