పల్లెటూళ్లో ఫారిన్ గోవిందుడు

26 Mar, 2014 23:58 IST|Sakshi
పల్లెటూళ్లో ఫారిన్ గోవిందుడు

రామ్‌చరణ్ తెరంగేట్రం చేసి ఏడేళ్లు. ఇప్పటికి ఆయన నటించిన ఏడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు... చిత్రాలు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేశాయి. నేటి హీరోల్లో ఇది రికార్డే. తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించి ఉంటారు చరణ్. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఫారిన్‌లో పెరిగి పల్లెటూరికొచ్చిన ప్రవాసాంధ్రునిగా చరణ్ ఇందులో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ బాబాయ్‌గా శ్రీకాంత్ కనిపిస్తారు. ఆయనకు జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నారు. తమిళ నటుడు రాజ్‌కిరణ్ ఇందులో చరణ్‌కి తాతగా కథకు కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. కన్యాకుమారి, పొలాచ్చిల్లో భారీ షెడ్యూల్ ముగించుకొని ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఏప్రిల్ రెండోవారం నుంచి 40 రోజుల పాటు భారీ షెడ్యూల్ జరుపనున్నారు. నేడు చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘కుటుంబ బంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో సాగే చక్కని వినోదాత్మక చిత్రంగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. కన్నుల పండువగా ఈ చిత్రం ఉంటుందని నమ్మకంగా చెప్పగలను.

చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, రాజ్‌కిరణ్.. ఇలా తారాగణం అంతా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. ఏప్రిల్ రెండోవారం నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన ఇంటి సెట్‌లోనూ, ఆర్‌ఎఫ్‌సీలోనూ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాం. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: తమన్.