విడాకులపై హీరోహీరోయిన్ల ప్రకటన

10 Jan, 2017 16:22 IST|Sakshi
విడాకులపై హీరోహీరోయిన్ల ప్రకటన

విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కోర్టును ఆశ్రయించిన హాలీవుడ్‌ హీరోహీరోయిన్లు  బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తొలిసారి సంయుక్తంగా ఓ ప్రకటన విడుదలు చేశారు. తమ ఆరుగురు పిల్లల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని, విడాకులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లన్నింటినీ రహస్యంగా ఉంచాలని ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు. కుటుంబం, పిల్లలకు సంబంధించి వ్యక్తిగత రహస్యాల హక్కులను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందంపై  బ్రాడ్ పిట్, ఏంజెలినా, వారి న్యాయవాదులు సంతకాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, అవసరమైన చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఓ ప్రైవేట్‌ జడ్జిని నియమించుకోవాలని నిర్ణయించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

పిల్లల సంరక్షణ బాధ్యతలపై ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. పిల్లలను తన వద్దే ఉంచాలని జోలీ కోరుకుంటుండగా, పిట్‌ మాత్రం సంరక్షణ బాధ్యతలను ఇద్దరికీ అప్పగించాలని కోరాడు. పిల్లలు మైనర్లు అయినందున వారిని తన వద్దే ఉంచాలని జోలీ భావిస్తోంది. పిట్‌, జోలీ విభేదాల గురించి గతంలో పలు వార్తలు వచ్చాయి. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా పిట్తో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తొలుత జోలీ చెప్పింది. ఓ ప్రైవేట్ విమానంలో పిట్ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే దీనికి కారణం. పిట్తో వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని జోలీ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. విడిపోయాక తీవ్ర ఒత్తిడికి గురైన ఏంజెలినా, చైన్ స్మోకర్గా మారినట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అలాగే జోలీ దూరమయ్యాక పిట్‌ విషాదంలో మునిగిపోయాడు. జోలీతో తన బంధం ముగుస్తుందని, విడాకులు తీసుకుంటామని బ్రాడ్ ఎప్పుడూ భావించలేదని సన్నిహితులు చెప్పారు. పిల్లలకు దూరంగా ఉండటం కూడా బ్రాడ్ను బాధిస్తున్నట్టు తెలిపారు. జోలీ, పిట్ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా