ఎంజెలినా జోలీ విడాకులకు కారణం ఇదే..!

22 Sep, 2016 19:58 IST|Sakshi
ఎంజెలినా జోలీ విడాకులకు కారణం ఇదే..!

లాస్‌ఏంజీల్స్: హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్ నుంచి ఎంజెలినా జోలి విడాకులు కోరిన విషయం తెలిసిందే. తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నందున విడాకులు తీసుకుంటున్నానని సోమవారం కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా ఎంజెలినా వ్యాఖ్యానించారు. 2005 నుంచి అన్యోన్యంగా కలిసుంటున్న వీరి మధ్య ఇంత సడన్గా అభిప్రాయ భేదాలు రావడం ఏంటని అభిమానులు తలలుగోక్కున్నారు. అయితే.. ఈ విడాకుల వ్యవహారానికి తక్షణ కారణం మాత్రం బ్రాడ్ పీట్ తన ఆరుగురు పిల్లల్లో ఒకరిపై తీవ్ర కోపంతో అరచి, కొట్టాడమేనట. ఇటీవల ప్రైవేట్ జెట్లో వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న బ్రాడ్.. తన పిల్లల్లో ఒకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని అందుకే ఎంజెలినా విడాకుల నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

బాలల హక్కుల చట్టాల కింద బ్రాడ్ పీట్పై విచారణ జరుగుతుందని సమాచారం. అయితే.. బ్రాడ్ పీట్ మాత్రం ఈ విషయంపై తీవ్రంగా స్పందించాడు. తాను తన పిల్లలపై ఎలాంటి హింసకు పాల్పడలేదని, కొందరు కావాలనే తనను చెడ్డవాడిలా చూపించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బ్రాడ్ పిట్, ఎంజెలినాలతో పాటు వారి ఆరుగురు పిల్లలను విచారించాలని అధికారులు భావిస్తున్నారు.