ఆయనను చూసే ఇండస్ట్రీలోకి వచ్చాను : చిరంజీవి

8 Jun, 2019 18:38 IST|Sakshi

తెలుగు తెరపై చెరిగిపోని నటుడు ఎస్వీరంగారావు.. శత జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ‘మహా నటుడు’ పేరుతో ఫొటో బయోగ్రఫీగా రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరుకాగా.. తమ్మారెడ్డి భరద్వాజ, బ్రహ్మానందం, తణికెళ్ల భరణి లాంటి ప్రముఖులు విచ్చేశారు. మహానటుడు ఎస్వీ రంగారావును చూసే తాను సినీ పరిశ్రమలోకి వచ్చానని చిరంజీవి అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘నేను గొప్పగా ఆరాధించే రంగారావు గారి పుస్తకం నేను రిలీజ్‌ చేయడం నా పూర్వ జన్మ సుకృతం. మా నాన్న గారికి రంగారావు అంటే ఎంతో అభిమానం. ఆయన రంగారావుతో సినిమా చేశారు. ఇంటికి వచ్చి రంగారావు గురించి గొప్పగా చెప్పేవారు అప్పటి నుంచి ఆయన అన్నా, నటన అన్నా నా ఒంట్లో బీజం పడింది. రామ్‌చరణ్‌ ఇండస్ట్రీలోకి రావాలని చెప్పగానే రంగారావు గారి సినిమాలు చూడమని సలహా ఇచ్చాను’ అని అన్నారు. 

బ్రహ్మానందం మాట్లాడుతూ.. మహానటుడు ఎస్వీ రంగారావు గారి మీద  సంజయ్‌ కిషోర్‌ పుస్తకం రాశారు.. అలాగే చిరంజీవి మీద కూడా పుస్తకం రాయాలని ఆయనను కోరారు. సంజయ్‌ ఏది చేసినా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటున్నారని, ఎంతో బాధ్యతగా, సంతోషంగా చిరంజీవిపై పుస్తకాన్ని రాస్తానని సంజయ్‌ కిషోర్‌ అన్నట్లు తెలిపారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటువంటి పుస్తకాలు తరువాతి తరానికి అవసరమని అన్నారు. ఇలాంటి పుస్తకాలను చిరంజీవి లాంటి వ్యక్తి విడుదల చేస్తేనే విలువ ఉంటుందని అన్నారు. చిరంజీవిని ఇండస్ట్రీ గురించి పట్టించుకోవాలని అడిగానని, ఆయన కొన్ని విన్నారని, కొన్ని చేశారని, మరికొన్ని సమస్యలు మీద వేసుకున్నారని అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. వ్యక్తి బతికి ఉండగా పట్టించుకోని వారున్న ఈ రోజుల్లో.. 45ఏళ్ల తరువాత రంగారావు గారి పుస్తకం రాయడమంటేనే ఆయన విలువ తెలుస్తోందని అన్నారు.

>
మరిన్ని వార్తలు