సంతోషం మన మధ్యే ఉంది : శ్రీకాంత్ అడ్డాల

19 May, 2016 01:57 IST|Sakshi
సంతోషం మన మధ్యే ఉంది : శ్రీకాంత్ అడ్డాల

 శ్రీకాంత్ అడ్డాల సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. కుటుంబమంతా చూసి, ఆనందించే సినిమాలు తీస్తారాయన.  ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’... ఇలా శ్రీకాంత్ చేసినవన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ని కూడా కుటుంబ సమేతంగా చూసే విధంగానే తెరకెక్కించారు. పీవీపీ పతాకంపై మహేశ్‌బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత ముఖ్య తారలుగా పీవీపీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల చెప్పిన విశేషాలు...
 

మహేశ్‌బాబు నాకు రెండో సారి అవకాశం ఇవ్వడమే గొప్ప విషయం అనుకుంటున్నా. ఆయన దర్శకుల ఆర్టిస్ట్. ఈ చిత్రకథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ‘మనకెన్నో ఆలోచనలు ఉంటాయి. ఎన్నో లక్ష్యాలుంటాయి. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య మనం అనుకున్నది జరుగుతుందా? లేదా అన్నది ప్రతి ఒక్కరి టెన్షన్. మనుషుల మధ్య ప్రశాంతత లేకుండా పోతోందని ఎక్కడికో వెళిపోతాం. కానీ సంతోషం, ఆనందం, ప్రశాంతత మనుషుల మధ్య మాత్రమే దొరుకుతుంది’ అనే కథాంశంతో రూపొందించాం. ఈ పాయింట్  విన్న వెంటనే మహేశ్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదే ఈ సినిమా చేయడానికి కొండంత బలాన్నిచ్చింది.
 
విజయవాడ నేపథ్యంలో సాగే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఓ సందర్భంలో కలుసుకున్న నాలుగైదు కుటుంబాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ‘బ్రహ్మోత్సవం’. నేనొకసారి ఓ చానల్ చూస్తున్నప్పుడు బ్రహ్మోత్సవం అనే పేరు కనబడింది. వెంటనే ఈ సినిమాకు టైటిల్ అదే అని ఫిక్స్ అయ్యాను. ఏడు తరాల కాన్సెప్ట్ అనేదే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే పాయింట్. దాని చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది.  
 
ఈ సినిమాలో ఎక్కువ మంది సీనియర్ నటీనటులతో పనిచేశాను.  కాంబినేషన్ సీన్స్ కారణంగా కాల్షీట్లు దొరక్కపోవడంతో వాళ్ల కోసం ఎక్కువ సార్లు వెయిట్ చేశాను. అంతకు మించి నాకు ప్రత్యేకించి ఎప్పుడూ ఒత్తిడి అనిపించలేదు.
 
సీనియర్ రచయిత గణేశ్ పాత్రో ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా కోసం ఎంతగానో నాకు హెల్ప్ చేశారు. అది నా స్థాయికి మించిన కథ. కానీ, ఆయన సహకారంతో  ఆ సినిమా బాగా వచ్చింది. ‘ముకుంద’ షూటింగ్ టైమ్‌లోనే ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి చెప్పాను. గణేశ్ నాకు రెండు, మూడు పేజీల స్క్రీన్‌ప్లే కూడా రాసిచ్చారు. ఇప్పుడు ఆయన లేకపోవడం బాధాకరమైన విషయం.
 
ఓ సన్నివేశంలో తండ్రి సత్యరాజ్ హడావిడిగా ఫంక్షన్‌కు వెళిపోతుంటే మహేశ్ పాత్ర ఆయన కాళ్లకు చెప్పులు తొడుగుతుంది. మామూలుగా ఏ హీరో అయినా అలా చేయడానికి కాస్త సందేహిస్తాడు. కానీ మహేశ్ ఆ సీన్‌లోని అంతరార్థాన్ని గ్రహించి వెంటనే ఒప్పుకున్నారు. అంతేగానీ యాడ్ కోసం ఆ సన్నివేశాన్ని చిత్రీకరించలేదు. ఆ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
 
ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. నేను చాలా కథలు రాసుకున్నా. అయితే నెక్ట్స్ ఎలాంటి సినిమా తీస్తానో ఇప్పుడే చెప్పలేను.

>