మంచి మాట చెప్పండి!

20 May, 2016 23:22 IST|Sakshi
మంచి మాట చెప్పండి!

కొత్త సినిమా గురూ!
తారాగణం: మహేశ్‌బాబు, సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, జయసుధ, రావు రమేశ్, శరణ్య తదితరులు.
సంగీతం: మిక్కీ జె మేయర్
నేపథ్య సంగీతం: గోపీ సుందర్
ఆర్ట్: తోట తరణి
సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
నిర్మాత: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కవిన్ అన్నే
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల

 
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో సినిమా అనగానే అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ‘క్షణం’, ‘ఊపిరి’ హిట్స్‌తో మంచి జోరు మీద ఉన్న పీవీపీ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. టైటిల్ ‘బ్రహ్మోత్సవం’ కావడంతో మంచి పండగలాంటి సినిమా చూడబోతున్నామనే ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. శుక్రవారం ఈ చిత్రం తెరపైకొచ్చింది.
 
కథ ఏంటంటే... ‘బతకడం అంటే అమ్ముకోవడం కాదు... నలుగుర్నీ నమ్ముకోవడం’ అనే  ఫిలాసఫీతో కోట్లు సంపాదించినా మనవాళ్లు చుట్టూ ఉండాలనుకునే వ్యక్తి  చంటిబాబు (సత్యరాజ్).  కేవలం తన మావగారు ఇచ్చిన 400 రూపా యలతో వ్యాపారం మొదలుపెట్టి, 400 కోట్లు సంపాదిస్తాడు. చంటిబాబుకి నా అన్నవాళ్లు లేకపోవడంతో భార్య తమ్ముళ్లను కూడా తన వాళ్లలా చూసుకుంటాడు. ఈ  చంటిబాబు కొడుకే హీరో (మహేశ్‌బాబు). తండ్రితో కలిసి వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు. అయితే, భార్య తమ్ముళ్లలో ఒకరైన బుజ్జి (రావు రమేశ్) తన బావ చంటిబాబులా ఎదగలేకపోతున్నాననే బాధ, అసూయలతో రగిలిపోతూ ఉంటాడు.

బావ ఆస్తి ఎలాగైనా తనకే రావాలని తన కూతురు (ప్రణీత)ను హీరోకిచ్చి చేద్దామను కుంటాడు. ఈలోపే హీరో- తన తండ్రి స్నేహితుని (‘శుభలేఖ’ సుధాకర్) కూతురు కాశీ అన్నపూర్ణతో (కాజల్) ప్రేమలో పడతాడు. కాశీకి కూడా ఇష్టమే అయినప్పటికీ వచ్చే పోయే బంధువులతో ఎప్పుడూ హడావిడిగా ఉండే ఇంట్లో ఎడ్జస్ట్ కాలేనంటుంది. దాంతో ఈ ఇద్దరికీ బ్రేకప్ అవుతుంది. వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసిన బుజ్జి రగిలిపోతాడు. ఆ కోపంలో చంటిబాబును తిడతాడు. ఈ హఠాత్పరిణామంతో తల్లడిల్లిన చంటిబాబు చనిపోతాడు. తన మూలాలను వెతుక్కోవాలనే.. తన వాళ్లను కలవాలనుకుంటాడు హీరో. ఏడు తరాల వాళ్లను అన్వేషించే మజిలీలో హీరో చెల్లి ఫ్రెండ్ (సమంత) కూడా హీరోకు జత కలుస్తుంది. ఆ తరువాత ఏమైంది అన్నది తాపీగా చూడాల్సిన మిగతా కథ.
 
తన కుటుంబానికి సంబంధించిన ఏడుతరాల వాళ్లను కలుసుకునే హీరో పాత్రలో మహేశ్‌బాబు అందంగా కనిపిస్తారు. సినిమాలో చెప్పుకోదగ్గది అసూయతో రగిలిపోయే పాత్రలో రావు రమేశ్ నటన. ఇంటర్వెల్‌కు ముందు అచ్చంగా ప్రేక్షకుల లానే ఆలోచిస్తూ, ఆ పాత్ర చెప్పే డైలాగులు. అక్కడ క్కడ కొన్ని సీన్లు మనసును తాకుతాయి. పీవీపి ఎంతో గ్రాండియర్‌గా నిర్మించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ తోటతరణి సెట్స్, రత్న వేలు సినిమాటోగ్రఫీ ఆయువుపట్టుగా నిలిచాయి. ఈ చిత్రంలో ‘ఓ మంచి మాట చెప్పండి’ అనే డైలాగుంటుంది. సినిమా చూసినవాళ్లకా మాట చెప్పాలనిపిస్తే ఈ సినిమా ఉత్సవమే.